పాకిస్తాన్‌ అంటే భయం లేదు.. ఇప్పుడెందుకు..

8 May, 2019 16:29 IST|Sakshi

న్యూఢిల్లీ : ఓపెన్‌ డిబేట్‌కు రావడానికి భయపడుతున్నారన్న విమర్శలపై మాజీ క్రికెటర్‌, తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఒక క్రికెటర్‌గా పాకిస్తాన్‌ అంటే ఎప్పుడూ భయపడని వ్యక్తిని.. మరి విపక్షాల సవాల్‌కు ఎందుకు భయపడతానని ప్రశ్నించారు. డిబేట్‌కు భయపడుతున్నది తాను కాదని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అని అన్నారు. ‘అధికారాన్ని చేపట్టి ఢిల్లీ ప్రజల్ని నిలువునా మోసం చేసిన సీఎంకు ఇటీవలే ఓపెన్‌ డిబేట్‌కు రావాలని సవాల్‌ చేశాను. అయితే, ముఖ్యమంత్రిగా నాలుగేళ్లు పాలించిన కేజ్రీవాల్‌... రాజకీయంగా కొన్ని రోజుల అనుభవం మాత్రమే ఉన్న తనతో భేటీ అయ్యేందుకు వెనుకాడొచ్చు. అందుకే ఆయన పొలిటికల్‌ కెరియర్‌లో ఓ సగం.. అంటే రెండేళ్ల అనంతరం డిబేట్‌కు అంగీకరించినా ఓకే. కానీ, ఇంతవరకు కేజ్రీవాల్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’ అని మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో గంభీర్‌ విమర్శలు చేశారు.
(చదవండి : తూర్పు ఢిల్లీ పిచ్‌  ఎవరికి అనుకూలం?)

లెక్కలేనన్ని విమర్శలు..
‘15 ఏళ్ల క్రికెట్‌ కెరియర్‌లో లేనన్ని విమర్శలు.. రాజకీయాల్లోకి వచ్చిన 15 గంటల్లో ఎదుర్కొన్నాను. ‘నా నామినేషన్‌ తిరస్కరణకు గురైందని ఆప్‌ నేతలు దుష్పచారం చేస్తారు. నాకు రెండు ఓటర్‌ ఐడీ కార్డులు ఉన్నాయని, నాపై ఎఫ్‌ఐఆర్‌ ఉందని బురదజల్లుతారు. ఇక సీఎం  కేజ్రీవాల్‌ మరో అడుగు ముందుకేసి నేను ఏడాదిలో 240 రోజులు విదేశాల్లో గడుపుతానని అంటారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో మునిగితేలే మాజీ క్రికెటర్‌కి ఓటేస్తారా అని వ్యాఖ్యానిస్తారు’ అని గంభీర్‌ ఆగ్రహం వ్య​క్తం చేశారు. ‘కేజ్రీవాల్‌ మాదిరి నేనెప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వను. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ధర్నాలు, డిబేట్‌లు, డ్రామాలు చేయడం కేజ్రీవాల్‌ విద్య’ అని చురకలంటించారు. దేశ రాజధాని ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న కేజ్రీవాల్‌ డిమాండ్‌ను మతిలేని చర్యగా గంభీర్‌ అభివర్ణించారు.

త్రిముఖ పోరు..
బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌, ఆప్‌ అభ్యర్థి ఆతిషి, కాంగ్రెస్‌ అభ్యర్థి అరవింద్‌ సింగ్‌ లవ్లీ మధ్య తూర్పు ఢిల్లీలో త్రిముఖ పోరు నెలకొంది. ఆతిషి రాజకీయ బరిలో దిగడం ఇదే మొదటిసారి. ఆమె ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు ఒకప్పుడు విద్యారంగంలో సలహాదారుగా ఉన్నారు. ఢిల్లీలో విద్యావ్యవస్థలో సంస్కరణలు ప్రవేశపెట్టి పాఠశాలల్ని ఒక గాడిలోకి తీసుకువచ్చి మంచిపేరు సంపాదించారు. ఆప్‌ ఆతిషి అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే సిట్టింగ్‌ ఎంపీ మహేశ్‌ గిరికి ఆమెను ఎదుర్కొనే సామర్థ్యం లేదని భావించిన కమలదళం వ్యూహం మార్చింది. గంభీర్‌ను బరిలోకి దించింది. ఇక కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న అరవింద్‌ సింగ్‌ లవ్లీ రెండేళ్లలోనే కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి, మళ్లీ బీజేపీ నుంచి కాంగ్రెస్‌కి పార్టీలు మారడం ప్రజల్లో ఆయనకున్న ఆదరణను తగ్గించిందనే చెప్పాలి. లవ్లీ మంత్రిగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

మరిన్ని వార్తలు