ఎన్నికలకు సిద్ధం కండి

27 Jun, 2018 03:39 IST|Sakshi

     ఎప్పుడైనా రావొచ్చు బూత్‌ కమిటీలను సమాయత్తం చేయండి

     టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని.. ఎదుర్కొనేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని టీడీపీ నాయకులకు సీఎం చంద్రబాబు సూచించారు. బూత్‌ కమిటీలను సమాయత్తం చేయాలని ఆదేశించారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసం పక్కనున్న గ్రీవెన్స్‌ హాలులో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం మాట్లాడారు. గెలుపు మనదేనని కార్యకర్తలను ఉత్సాహపరచాలని.. గెలుపుపై వారిలో అనుమానం రాకుండా పనిచేయించాలని సూచించారు. ఎన్నికలపై చాలా సర్వేలు వస్తున్నాయని.. కానీ తాను చేయించిన సర్వే ప్రకారమే ముందుకెళుతున్నానని చెప్పారు. నాలుగేళ్లలో చాలా అభివృద్ధి చేశామంటూ ప్రచారం చేయాలన్నారు.

వీఆర్‌ఏలు, అంగన్‌వాడీలు, హోంగార్డుల జీతాలు పెంచిన విషయంపై పెద్దఎత్తున ప్రచారం చేయాలని.. త్వరలో 20 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని.. ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. వైఎస్సార్‌సీపీపై ఎదురుదాడి చేయాలని.. బీజేపీతో లింక్‌ పెట్టి వైఎస్సార్‌సీపీపై దాడి పెంచాలని సూచించారు. ఈ నెల 29న కాకినాడలో ధర్మపోరాట సభ నిర్వహించాలని నిర్ణయించామని.. అలాగే 30వ తేదీన నెల్లూరులో దళిత తేజం ముగింపు సభ నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ నెల 28న నిర్వహించే ఏరువాక కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆదేశించారు. కడపలో సీఎం రమేశ్, బీటెక్‌ రవి చేస్తున్న దీక్షకు మద్దతుగా బుధ, గురువారాల్లో ర్యాలీలు, ధర్నాలు చేయాలని.. 28న ఢిల్లీలో ఎంపీలు ధర్నా చేస్తారని తెలిపారు. జూలై 16వ తేదీకి ప్రభుత్వం ఏర్పడి 1,500 రోజులవుతుందని.. ఈ సందర్భంగా 16వ తేదీ నుంచి జనవరి 10 వరకు గ్రామదర్శిని కార్యక్రమం చేపట్టి గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. సింగపూర్‌పై నాకెప్పుడూ ఆరాధనాభావమే.. 

సింగపూర్‌ అంటే తనకెప్పుడూ ఆరాధనా భావమే ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. సింగపూర్‌ ఎప్పటికీ తమకు సహకరించాలన్నదే తన భావమన్నారు. సింగపూర్‌ జాతీయ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెకండ్‌ మినిస్టర్‌ డెస్మాండ్‌ లీ టీ సెంగ్‌ తన బృందంతో కలసి మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజ్ఞాన సమాచార మార్పిడికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై బిల్డింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌ సీఈవో హ్యూగ్‌ లిమ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌ సంతకాలు చేశారు. అనంతరం డెస్మాండ్‌ లీ మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధికి సహకరించాలని నిర్ణయించినప్పటి నుంచి అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చామని చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ.. 60 కిలోమీటర్ల మేర నదీ అభీముఖ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కాగా, నిర్మాణ సామగ్రి తయారీ నగరం ఏర్పాటులో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్‌ ఆసక్తి కనబరిచింది. దీనిపై వచ్చే నెల రెండో వారంలో సీఎం జరిపే సింగపూర్‌ పర్యటనలో చర్చించాలని నిర్ణయించారు.

తిరుపతిలో ఫ్లెక్స్‌ ట్రానిక్స్‌ పరిశ్రమ
తిరుపతిలో రూ.585 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను స్థాపించేందుకు ఫ్లెక్స్‌ ట్రానిక్స్‌ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదర్చుకుంది. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో ‘ఫ్లెక్స్‌’ సంస్థ ప్రతినిధులు ఫ్రాంకిస్‌ బార్బియర్, థామస్‌ మేనన్‌లు సమావేశమయ్యారు. తిరుపతిలో స్థాపించే పరిశ్రమ ద్వారా 6,600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు వివరించారు.  

మరిన్ని వార్తలు