పది పార్టీలు పోరాడుతున్నా పట్టించుకోరా?

20 Mar, 2018 13:56 IST|Sakshi
గులాంనబీ ఆజాద్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు జరుగుతున్న ఆందోళనలను మోదీ సర్కారు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాంనబీ ఆజాద్‌ విమర్శించారు. రాజ్యసభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ... పది పార్టీలు ఒకే అంశంపై పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌ సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీ అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తక్షణం చర్చ చేపట్టి ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆజాద్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందిస్తూ.. తమను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌ పార్టీకి లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని ఎదురుదాడి చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టకుండా ఇప్పుడు తమను అడుగుతారా అని ప్రశ్నించారు. కాగా, ప్రత్యేక హోదా అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది.

మరిన్ని వార్తలు