జమ్మూకశ్మీర్‌ను తుక్‌డాలు.. తుక్‌డాలు చేసింది

5 Aug, 2019 18:30 IST|Sakshi

కేంద్రం చర్య దేశం తలను నరికేసేలా ఉంది

జమ్మూకశ్మీర్‌ ఉనికిని దెబ్బతీస్తుంది

రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత ఆజాద్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్‌ 370ని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్య ద్రోహపూరితమైనదని, ప్రభుత్వ చర్య దేశం తలను నరికేసేలా ఉందని ధ్వజమెత్తారు. కేవలం ఓట్ల కోసం చేపట్టిన ఈ చర్యతో జమ్మూకశ్మీర్‌ చరిత్ర, సంస్కృతి ధ్వంసమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌ను, జమ్మూకశ్మీర్‌ను కలిపే వంతెన ఆర్టికల్‌ 370 అని, దీనిని రద్దు చేయడం ద్వారా బీజేపీ సర్కారు భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆజాద్‌ మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌ను విభజించడం ద్వారా దేశం తలను నరికేయడమే కాకుండా.. రాష్ట్రాన్ని బీజేపీ ‘తుక్‌డ తుక్‌డా’ లు (ముక్కలు ముక్కలు) చేసిందని మండిపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం ద్వారా జమ్మూకశ్మీర్‌ ఉనికే లేకుండా చేశారని విమర్శించారు. చైనాతో, పాకిస్థాన్‌తో, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో సరిహద్దులు కలిగిన రాష్ట్ర ప్రజలతో ఇలాంటి ఆటలు ఆడటం ప్రమాదకరమని, ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు లేకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం దేశద్రోహం లాంటిదేనని ఆజాద్‌ పేర్కొన్నారు. అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేసి.. రాష్ట్రానికి బలగాలను పంపించి.. మాసీ సీఎంలైన మెహబుబా ముఫ్తి, ఒమర్‌ అబ్దుల్లాలను గృహనిర్బంధంలో ఉంచి కేంద్రం ఈ రకమైన నిర్ణయం తీసుకుందని, జమ్మూకశ్మీర్‌ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ సర్కారు వమ్ము చేసిందని తప్పుబట్టారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా