కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ముర్ము

26 Oct, 2019 03:23 IST|Sakshi
గిరీశ్‌ చంద్ర ముర్ము, ఆర్‌.కె.మాథుర్‌, సత్యపాల్‌ మాలిక్‌, దినేశ్వర్‌ శర్మ, శ్రీధరన్‌ పిళ్లై

లదాఖ్‌కు ఆర్‌కే మాథుర్‌

గోవా గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌  

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితుడైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గిరీశ్‌ చందర్‌ ముర్ము శుక్రవారం జమ్మూకశ్మీర్‌ తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో ముర్ము సీఎం అడిషనల్‌ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖలో సెక్రటరీగా ఉన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంతో పాటు జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్‌ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్ట్‌ 5న కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ నవంబర్‌ 1వ తేదీ నుంచి జమ్మూకశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పరిపాలన కొనసాగిస్తుంది.1985 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ముర్ము ఈ నవంబర్‌ 30 న పదవీ విరమణ చేయనున్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఈ నెల 31న శ్రీనగర్లో ముర్ము ప్రమాణ స్వీకారంచేస్తారు. కశ్మీర్, జమ్మూ ప్రాంతాల పరిపాలనాధికారిగా ఆయన వ్యవహరిస్తారు. మరోవైపు, లదాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్‌కే మాథుర్‌ నియమితులయ్యారు.మాథుర్‌ 1977 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. గత సంవత్సరం ప్రధాన సమాచార కమిషనర్‌గా రిటైర్‌ అయ్యారు.

లదాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆయన అక్టోబర్‌ 31న లేహ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. జమ్మూకశ్మీర్‌ ప్రస్తుత గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ గోవా గవర్నర్‌గా వెళ్తున్నారు. తన మిగతా పదవీకాలాన్ని ఆయన గోవాలో పూర్తి చేస్తారు. ముర్ము లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజే ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌కు సలహాదారులుగా వ్యవహరిస్తున్న కే విజయకుమార్, ఖుర్షీద్‌ గనాయి, కే సికందన్, కేకే శర్మల పదవీకాలం కూడా ముగుస్తుంది. మరోవైపు, మాజీ ఐబీ చీఫ్‌ దినేశ్వర్‌ శర్మను లక్షద్వీప్‌ పరిపాలనాధికారిగా నియమిస్తూ కేంద్రం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మిజోరం గవర్నర్‌గా బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లైను నియమించారు.  

మరిన్ని వార్తలు