అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ

25 Jun, 2018 02:41 IST|Sakshi
ఆదివారం నల్లగొండ సభలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

జనచైతన్య యాత్రలో కె.లక్ష్మణ్‌ 

అవినీతి రహిత పాలన కోసం బీజేపీకి అవకాశం ఇవ్వండి 

నల్లగొండ టూటౌన్‌: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వెల్లడించారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్ర ఆదివారం నల్లగొండకు చేరింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైతులకు రుణమాఫీ అమలు చేసిందన్నారు. మెట్ట ప్రాంతాల్లో పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే బోరు బావుల మీద ఆధార పడిన రైతాంగానికి ఉచితంగా బోర్లు వేయిస్తామన్నారు. సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.

అవినీతి రహిత పాలన కోసం ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని పేర్కొన్నారు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఆదిరెడ్డిలాంటి అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నలుగురికే అంకితమైందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ కొడుకు, కూతురు, అల్లుడికి ఉద్యోగాలు వచ్చాయి గానీ తెలంగాణ కోసం ముందుండి కొట్లాడిన యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం మొండి చేయి చూపిందన్నారు. గత ప్రభుత్వాలు పిట్టగూళ్లు కడితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్లు అని మోసం చేసిందని విమర్శించారు. కమీషన్ల కోసం మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలు మొదలు పెట్టిందని లక్ష్మణ్‌ ఆరోపించారు. అవినీతి, బంధుప్రీతి, డబ్బు సంపాదన, మోసం, దగాలను చవి చూసిన ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ అబద్ధాల పుట్ట అని, దళితుడిని ముఖ్యమంత్రిని చేసి తెలంగాణకు కాపాలా కుక్కలా ఉంటానని చెప్పి అధికారం అనుభవిస్తున్నారని ఆరోపించారు. 1,200 అమరుల కుటుంబాల్లో ఎంత మందికి రూ.10 లక్షలు ఇచ్చావు అని ప్రశ్నించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు