‘చివరి అవకాశం ఇస్తున్నాం.. తేల్చుకోండి’

19 Apr, 2019 21:59 IST|Sakshi

పొత్తులపై కాంగ్రెస్‌కు ఆప్‌ అల్టిమేటం

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు చివరి అవకాశం ఇచ్చినట్లు ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) తెలిపింది. సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు కాంగ్రెస్‌కు మరో అవకాశం ఇస్తున్నట్లు ఆపార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ ప్రకటించారు. ఆప్‌-కాంగ్రెస్‌ పొత్తును దేశ ప్రజలు  కోరుకుంటున్నారని, దీనిపై  కాంగ్రెస్ పునరాలోచించుకోవాలని అల్టిమేటం జారీచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీతో పొత్తుకు ఆప్ వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో సీట్ల పంపకం ఖరారైన తర్వాత కూడా వారి నుంచి ఎలాంటి స్పందనలేదన్నారు.

తాను ఆప్ నేత జయ్ సింగ్‌తో చర్చలు జరిపానని, ఆప్ 4 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ, కాంగ్రెస్ 3 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయడానికి అంగీకారం కుదిరిందని చెప్పారు. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత ఆప్ ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడుతోందన్నారు. ఒక రాష్ట్రంలో పరిస్థితి మరొక రాష్ట్రంలో ఉండదని తాను మొదటి నుంచి తాము వివరిస్తూనే ఉన్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో పొత్తు ఉన్నా, లేకపోయినా, ఢిల్లీలో పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆప్ తుది అంగీకారాన్ని తెలిపిందని, కానీ శుక్రవారం ఉదయం వెనుకడుగు వేసిందని చెప్పారు. ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు 6వ దశలో, మే 12న పోలింగ్ జరుగుతుంది.

నామినేషన్ ప్రక్రియను వాయిదా..
ఆప్-కాంగ్రెస్ మధ్య పొత్తుల వ్యవహారం ఎంతకూ తెమలకపోవడంతో చిట్టచివరి ప్రయత్నంగా అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని 'ఆప్' పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ముగ్గురు ఆప్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను ఈనెల 22కు వాయిదా వేసింది. తద్వారా సీట్ల షేరింగ్ ఫార్ములాలో భాగంగా మూడు సీట్లు కాంగ్రెస్‌కు ఇవ్వగలమన్న సంకేతాలు పంపింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు