గోవాలో మొదలైంది

11 Jul, 2019 02:56 IST|Sakshi
గోవా అసెంబ్లీ స్పీకర్‌ రాజేశ్‌ పట్నేకర్‌కు లేఖను అందిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి

గోవా అసెంబ్లీలో 5కి తగ్గిన కాంగ్రెస్‌ బలం

పణజీ: కర్ణాటకలోని రాజకీయ అస్థిరత గోవానూ తాకింది. ఇప్పటివరకు గోవాలో కాంగ్రెస్‌కు మొత్తం 15 మంది ఎమ్మెల్యేలుండగా, బుధవారం 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. మూడింట రెండొంతుల మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో వారి చేరిక చట్టబద్ధమైంది. ప్రతిపక్ష నేత చంద్రకాంత్‌ కవ్లేకర్‌ నేతృత్వంలోని మొత్తం 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. గోవా అసెంబ్లీ స్పీకర్‌ రాజేశ్‌ పట్నేకర్‌ను సాయంత్రం పది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కలిసి, తాము కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు ఓ లేఖను ఆయనకు అందిం చారు.

నీలకంఠ హలార్న్‌కర్, అటనాసియో మాన్సెరట్ట్, జెన్నిఫర్‌ మాన్సెరట్ట్, ఫ్రాన్సిస్‌ సిల్వీరా, ఫిలిప్‌ నెరీ రోడ్రిగుస్‌ తదితరులు వారిలో ఉన్నారు. పది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ భవనానికి వచ్చినప్పుడు గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ మాట్లాడుతూ ఇక నుంచి ఆ 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పార్టీ వారేనని అన్నారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలుండగా, ఇప్పటివరకు 17 సీట్లతో బీజేపీ పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్‌కు 15 మంది సభ్యులున్నా, ఇప్పుడు 10 మంది బీజేపీలో చేరడంతో బీజేపీ బలం 27కి పెరిగింది. గోవా ఫార్వర్డ్‌ పార్టీకి ముగ్గురు, మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ, ఎన్సీపీలకు చెరొక ఎమ్మెల్యే ఉన్నారు. మిగిలిన ముగ్గురూ స్వతంత్ర ఎమ్మెల్యేలు.

మరిన్ని వార్తలు