ఫిరాయింపు నేతల్లో ముగ్గురికి మంత్రి పదవులు

13 Jul, 2019 02:55 IST|Sakshi
ప్రమోద్‌ సావంత్‌

నేడు ప్రమాణ స్వీకారం

జీఎఫ్‌పీ మంత్రుల రాజీనామాను కోరిన ముఖ్యమంత్రి

పనాజీ: కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం లభించనుంది. వారితో పాటు డిప్యూటీ స్పీకర్‌ మైఖేల్‌ లోబోను మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్టు అధికార బీజేపీ నాయకుడొకరు తెలిపారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న గోవా ఫార్వర్డ్‌ పార్టీ(జీఎఫ్‌పీ) మంత్రులు ముగ్గురినీ తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. గోవాలో ప్రమోద్‌ సావంత్‌ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి జీఎఫ్‌పీ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ సరదేశి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. గోవా శాసన సభలోని 15 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో పది మంది గత బుధవారం బీజేపీలో చేరారు. వారితో కలిసి లోబో శుక్రవారం ఢిల్లీలో అమిత్‌షాను కలిసి వచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేరికతో 40 మంది సభ్యులున్న శాసన సభలో బీజేపీ బలం 27కు పెరిగింది. ఇదిలా ఉండగా, తమ మంత్రివర్గంలోని జీఎఫ్‌పీకి చెందిన ముగ్గురు మంత్రులను రాజీనామా చేయాలని కోరినట్టు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ చెప్పారు. అలాగే, ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేల రోహన్‌ కాంటేను కూడా మంత్రి పదవికి రాజీనామా చేయాలని అడిగినట్టు చెప్పారు.మంత్రి వర్గంలోకి కొత్తగా నలుగురిని తీసుకుంటున్నందున వీరి రాజీనామాలను కోరినట్టు శుక్రవారం ఆయన తెలిపారు.అధిష్టానం చెప్పిన మేరకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు