అతిపిన్న వయస్కురాలైన ఎంపీగా మాధవి

25 May, 2019 12:07 IST|Sakshi
గొడ్డేటి మాధవి

ఉద్దండుల్ని ఓడించిన ఘనత సొంతం

గతంలో కంటే రెట్టింపు మెజారిటీ

విశాఖపట్నం, పాడేరు: అరకు లోక్‌సభ స్ధానం నుంచి పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నికైన గొడ్డేటి మాధవి పార్లమెంట్‌లో అడుగుపెడుతున్న అతిపిన్న వయస్కురాలిగా ఘనత సాధించనున్నారు. పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నిక కావడం విశేషం. గతంలో హర్యానాకు చెందిన దుష్యంత్‌ చౌహన్‌ 28 ఏళ్ల వయస్సులో ఎన్నికై పార్లమెంట్‌కు వెళ్లి అతిపిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. ఇప్పుడు మాధవి 26 ఏళ్ల వయస్సులోనే ఆమె ఎంపీగా ఎన్నికై  పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు. వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్‌ వంటి ఉద్దండుల్ని ఓడించి మాధవి ఘనత సాధించడమే కాకుండా పిన్న వయస్కురాలిగా పార్లమెంట్‌కు వెళుతుండడం విశేషం.

గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్‌ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. గత 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కొత్తపల్లి గీతకు 4,13,191ఓట్లు రాగా 91,398 పైచిలుకు మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన గొడ్డేటి మాధవికి 2.25 లక్షల మెజార్టీ రావడం విశేషం. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కిశోర్‌ చంద్రదేవ్‌కు 3,60, 458 ఓట్లు రాగా 1,92,444 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇదే స్థాయిలో మాధవి కూడా భారీ ఆధిక్యత సాధించి ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎంపీలందరి కంటే మాధవికి భారీ ఆధిక్యత లభించింది. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఘన విజయం సాధించిన వైఎస్సార్‌సీపీకి మన్య ప్రాంత ప్రజలంతా బ్రహ్మరథం పట్టడంతో గొడ్డేటి మాధవికి భారీ ఆధిక్యత లభించింది.

2019 ఎన్నికల్లో అరకు లోక్‌సభ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లు వివరాలు
కిశోర్‌ చంద్ర సూర్యనారాయణ దేవ్‌(టీడీపీ)– 3,38,101, కేకేవీవీ సత్యనారాయణ రెడ్డి (బీజేపీ) – 17,867, గొడ్డేటి మాధవి (వైఎస్సార్‌సీపీ) – 5,62,190, శృతిదేవి వైరిచర్ల (కాంగ్రెస్‌) – 17,730, వంపూరు గంగుల మయ్య (జనసేన)–42,794, స్వాముల సుబ్రహ్మణ్యం (జనజాగృతి)– 4,710, అనుముల వంశీకృష్ణ(ఇండిపెండెంట్‌)– 10,240, కంగల బాలుదొర (ఇండిపెండెంట్‌)– 13,826, నరవ సత్యవతి( ఇండిపెండెంట్‌) – 11,236, బిడ్డిక రామయ్య( ఇండిపెండెంట్‌)– 7867

మరిన్ని వార్తలు