ఆమె గాంధీ ఆత్మనే చంపేసింది..

18 May, 2019 13:19 IST|Sakshi

ప్రజ్ఞాసింగ్‌పై మండిపడిన నోబుల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్‌ సత్యార్థి  

గాడ్సే గాంధీ శరీరాన్ని మాత్రమే హత్య చేస్తే

ప్రజ్ఞా సింగ్‌ గాంధీ ఆత్మను చంపేసింది

తక్షణమే ఆమెను బహిష్కరించండి - కైలాశ్‌ సత్యార్థి  

జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరం గాడ్సే నిజమైన దేశభక్తుడన్న బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై విమర్శల పరంపర కొనసాగుతోంది.  ప్రతిపక్ష పార్టీలతోపాటు, అధికార బీజేపీ సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే క్రికెట్‌, బిజినెస్‌ ఇలా వివిధ  రంగాల ప్రముఖులు కూడా ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలకు నిరసనగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి  నోబెల్‌ శాంతి బహుమతి  గ్రహీత కైలాశ్‌ సత్యార్థి  చేరారు.  

గాడ్సే గాంధీ శరీరాన్ని మాత్రమే హత్య చేశాడు. కానీ  ప్రజ్ఞాసింగ్‌ లాంటి వాళ్లు  గాంధీ ఆత్మను, దానితో పాటు అహింస, శాంతి, సహనాలను  చంపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ మేరకు  శనివారం  ఆయన  ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు.  చిన్న చిన్న స్వలాభాల కోసం బీజేపీ నాయకత్వం తాపత్రయ పడుతోందని మండిపడ్డారు. తక్షణమే ఆమెను బీజేపీ పార్టీనుంచి బహిష్కరించాలంటూ ట్వీట్‌ చేశారు.  

కాగా  మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ను భోపాల్ లోక్‌సభ  స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీకి నిలపడమే సర్వత్రా పెద్ద చర్చకు దారి తీసింది. మరోవైపు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా   గాంధీని  హత్య చేసిన గాడ్సే దేశభ​క్తుడని వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్నే రేపింది.   గాడ్సే మొదటి హిందూ తీవ్రవాదిగా పేర్కొన్న సినీహీరో రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు కౌంటరగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్‌ నేత, భోపాల్‌ బీజేపీ అభ్యర్ధి దిగ్విజయ్‌ సింగ్‌, ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జీవాలా కూడా సాధ్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.   సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన ప్రజ్ఞా సింగ్‌ క్షమాపణలు చెప్పక తప్పలేదు. అటు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పిలిచిన ఆమెను ఎన్నటికి క్షమించనని  వ్యాఖ్యానించడం విశేషం.  

మరిన్ని వార్తలు