టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం

29 May, 2019 07:09 IST|Sakshi
మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ సభ్యులుగా విజయం సాధించిన రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు సన్మానం

ప్రశ్నించే గొంతుకలను కాపాడాలని మమ్మల్ని గెలిపించారు

మీడియాతో కాంగ్రెస్‌ నుంచి ఎంపీలుగా గెలిచిన ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి 

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో లేదని 16 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న అహంకార ప్రకటనలకు, కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ధోరణికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. డబ్బు ప్రవాహంతో ఎన్నికలు ఎదుర్కొన్నప్పటికీ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకున్నారని ఫలితాలు స్పష్టం చేశాయి.    – ఉత్తమ్‌

అధికారం వస్తుంది.. పోతుంది.. కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం బతికే ఉంటుంది. 14 మంది ఎంపీలున్నా ప్రజలకు కేంద్రం ఇచ్చిన హామీలను సాధించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారు. మేం ముగ్గురమే ఉన్నా నిరంతరం ప్రజల కోసం పార్లమెంట్‌లో, బయటా పోరాడుతాం.     – కోమటిరెడ్డి

ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మోగుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తమై కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు మమ్మల్ని గెలిపించారు. ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించడానికి కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలకు ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీల విజయం అడ్డుకట్ట వేస్తుంది.     – రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : అహంకార ధోరణితో పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్లిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని కాంగ్రెస్‌ నుంచి ఎంపీలుగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య మూలాలను కాలరాస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను అనైతికంగా కలుపుకుని అణచివేత చర్యలకు పాల్పడిన టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారి గాంధీభవన్‌లో ముగ్గురు కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్, నల్లగొండ నుంచి ఎంపీగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో లేనే లేదని 16 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న అహంకారపూరిత ప్రకటనలకు, కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ధోరణికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి డబ్బు ప్రవాహంతో ఎన్నికలు ఎదుర్కొన్నప్పటికీ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకున్నారని ఫలితాలు స్పష్టం చేశాయన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రజలకు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదనే విషయం స్పష్టంగా అర్థం చేసుకుని ఈ తీర్పునిచ్చారని అన్నారు.

తమ గెలుపునకు సహకరించిన ఓటర్లు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా రాష్ట్ర విభజన బిల్లులోని అన్ని హామీలను నెరవేర్చేలా పార్లమెంట్‌లో పోరాటం చేస్తామని చెప్పారు. ఖాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఐటీఐఆర్‌లు రాష్ట్రానికి వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. అలాగే పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు ఎక్కడ సమస్య వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరించిందని, ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను గద్దెదించే శక్తి తమకు మాత్రమే ఉందని, లక్కీ లాటరీలో నాలుగు స్థానాలు వచ్చినంత మాత్రాన బీజేపీ ఎప్పటికీ రాష్ట్రంలో బలోపేతం కాదన్నారు. ఏనాటికైనా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ మాత్రమేనని, టీఆర్‌ఎస్‌ను ఓడించాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ కన్నా బీజేపీ అభ్యర్థులు బలమైన వారని భావించి ఆయా స్థానాల్లో వారికి ఓట్లు వేశారే తప్ప ఆ పార్టీ బలం ఎక్కడా పెరగలేదన్నారు. సెక్యులరిజం బలంగా నాటుకుపోయిన ప్రజల హృదయాల్లో బీజేపీకి భవిష్యత్‌ లేదని ఉత్తమ్‌ చెప్పారు.  

ప్రశ్నించే గొంతుకలను గెలిపించారు : రేవంత్‌
రాష్ట్ర ఓటర్లలో 12 శాతం ఓట్లు కలిగిన మినీ భారత దేశంలాంటి మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానంలో తన గెలుపు ప్రజలదని మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మోగుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తమై కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు తనను గెలిపించారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించడానికి కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలకు ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీల విజయం అడ్డుకట్ట వేస్తుందన్నారు. ప్రశ్నించే గొంతుకలను కాపాడాలనే ఉద్దేశంతోనే ప్రజలు తమను గెలిపించారని చెప్పారు. ప్రజలిచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని, దేశ విచ్ఛిన్న ప్రయత్నాలకు ఒడిగడుతున్న బీజేపీని అడ్డుకోవడంతో పాటు రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.

రేవంత్‌ బీజేపీలోకి వెళుతున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి కదా అని విలేకరులు ప్రశ్నించగా.. ప్రజలు, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. మైకందుకున్న కోమటిరెడ్డి తమపై కూడా సోషల్‌ మీడియాలో అవాస్తవాలు వస్తున్నాయని, ఉత్తమ్‌ టీపీసీసీ అధ్యక్షుడు కనుకనే ఆయనపై రావడం లేదని, తామెవరం పార్టీని వీడి వెళ్లేది లేదన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 90 శాతం సీట్లలో పార్టీ గెలిచేలా కృషి చేస్తామని చెప్పారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ చేతులు, కాళ్లు కట్టేసి టీఆర్‌ఎస్‌ చేవెళ్ల నియోజకవర్గంలో స్వల్ప మెజార్టీతో గెలిచిందని అన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలోని 15 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్, ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

రాబోయే కాలం కాంగ్రెస్‌ పార్టీదే: కోమటిరెడ్డి
అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్‌ ఫలితాలకు చాలా తేడా కనిపించిందని, రాబోయే కాలం కాంగ్రెస్‌ పార్టీదేనని భువనగిరి నుంచి ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఆదుకునేందుకు తాము సిద్ధంగా ఉంటామని, అధికారం వస్తుంది.. పోతుంది.. కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం బతికే ఉంటుందని చెప్పారు. 14 మంది ఎంపీలున్నా తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చిన హామీలను సాధించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని, తాము ముగ్గురమే ఉన్నా నిరంతరం ప్రజల కోసం పార్లమెంటులో, బయటా పోరాడుతామని అన్నారు. స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని, మున్సిపల్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన విజయానికి సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు