ఒకే పేరుపై రెండు పోస్టల్‌ బ్యాలెట్లు ఇస్తే కఠిన చర్యలే : ద్వివేది

25 Apr, 2019 15:42 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్‌ బూతుల్లో నిర్వహించాల్సిన రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం రావాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన తర్వాతే రీపోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఒకే పేరుపై రెండు పోస్టల్‌ బ్యాలెట్లు ఇచ్చే అవకాశం లేదని, అలా ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్‌కు గంట ముందు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వొచ్చునని స్పష్టం చేశారు.

వెంకటగిరి ఎమ్మెల్యే ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను బెదిరించినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీనిపై విచారణ జరపాలని నెల్లూరు కలెక్టర్‌ను ఆదేశించానన్నారు. ఎన్నికల కౌంటింగ్‌ కోసం 21వేల మంది వరకూ సిబ్బంది అవసరమని చెప్పారు. ఆఖరి నిమిషం వరకూ ఎవరూ ఎక్కడ లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారో తెలియకుండా జాగ్రత్త పడుతున్నామని తెలిపారు. రెండు సార్లు సిబ్బంది ర్యాండమైజేషన్‌  ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ పరిధిలో ఐదేసి పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల కౌంటింగ్‌కు 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్‌ అసిస్టెంట్‌, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమిస్తున్నామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు