'సీఎం జగన్‌ దమ్మేంటో ప్రజలకు తెలుసు'

4 Dec, 2019 09:42 IST|Sakshi
ప్రభుత్వ వైద్యశాలలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి

సాక్షి, నరసరావుపేట: ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దమ్మూధైర్యం ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసని, చంద్రబాబు పుత్రుడు, దత్తపుత్రులకు తెలియకపోవటం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్‌కు దమ్మూధైర్యం లేవంటూ ట్విట్టర్‌లో లోకేష్‌, పవన్‌కల్యాణ్‌ ఒకేరోజు పోస్ట్‌ చేశారు. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం వైఎస్సార్‌ ఆసరా చెక్కుల పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా ఎదుట లోకేష్‌, పవన్‌కల్యాణ్‌ పోస్టులపై స్పందించారు. అప్పటి  ప్రధానమంత్రితో పాటు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాందీని ఎదిరించి సొంతగా పార్టీ పెట్టుకున్న ధైర్యం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని గుర్తుచేశారు.  ఇటీవలి ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 సీట్లు గెల్చుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత వైఎస్‌ జగన్‌ సొంతమని పేర్కొన్నారు.

తాను పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం మంగళగిరి పేరును కూడా స్పష్టంగా పలకలేని లోకేష్‌కు, పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయిన పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి దమ్మూ ధైర్యం గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవాచేశారు. టీడీపీ నేతలతో పాటు పవన్‌ కల్యాణ్‌ మంతం పేరిట ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ప్రజల మధ్య మతం, కులాల ప్రస్థావన తెస్తున్నారని, మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమ ర్శించారు. రాష్ట్రంలో డబ్బులు ఉన్నాయోలేదో అని కాకుండా మంచి పనులు చేస్తున్నామా లేదా అనే ధోరణితోనే సీఎం వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఆరు నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే దానికి కూడా మతం రంగు పులిమే సంస్కృతిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. అమలుచేసే పథకాల్లో తప్పులు, పొరపాట్లు ఉంటే చెబితే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. వ్యక్తిగతంగా సీఎంను దూషిస్తూ, ప్రజల మధ్య మతం, కులం పేరిట విభేదాలు తెచ్చే చర్యలకు ఇకనైనా ప్రతిపక్ష నాయకులు విడనాడాలని హితవుపలికారు.

మరిన్ని వార్తలు