‘ప్రపంచంలో ఇలాంటి స్పీకర్‌ మరొకరు ఉండరు’

20 Aug, 2019 14:40 IST|Sakshi

సాక్షి, గుంటూరు : అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఫర్నీచర్‌ను తానే తీసుకున్నట్టు శాసనసభ మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు ఒప్పుకున్నారు. ఎవరైనా వస్తే ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేస్తా..  లేకపోతే విలువ ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానని చెప్తున్నారు. ఇక కోడెల వ్యవహారంపై నరసరావుపేట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. కోడెల లాంటి వ్యక్తులు రాజకీయాలకు అనర్హులంటూ ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలతో ప్రజల్ని పీల్చి పిప్పిచేసిన కోడెల.. చివరికి దొంగతనానికి పాల్పడటం దారుణమని అన్నారు.
(చదవండి : చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల శివప్రసాద్‌..!)

కొట్టేసిన ఫర్నీచర్‌ని గుంటూరులోని గౌతమ్‌ హోండా షోరూమ్‌లో పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారులు నిలదీయడంతో చేసిన తప్పును ఒప్పుకున్నారని, ప్రపంచంలో కోడెల లాంటి స్పీకర్‌ మరొకరు ఉండరని ఎద్దేవా చేశారు. నరసరావుపేట పరువు పోతుందనే ఉద్దేశంతో ఇంకా కొన్ని విషయాలు బయటపెట్టడం లేదని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కోడెలకు డబ్బులు కావాలంటే తామంతా చందాలు వేసుకుని ఇస్తామని హితవు పలికారు. రాష్ట్రం విడిపోవడంతో అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్‌, కంప్యూటర్లు హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలించారు. ఈ క్రమంలో కొంత  ఫర్నీచర్‌ మాయమైంది. అప్పుడు కోడెల శివప్రసాదరావు ఏపీ స్పీకర్‌గా ఉండటంతో ఆయనపై ఆరోపణలొచ్చాయి.

మరిన్ని వార్తలు