వైఎస్సార్‌సీపీలో చేరిన గోరంట్ల మాధవ్‌

27 Jan, 2019 04:20 IST|Sakshi
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన గోరంట్ల మాధవ్, చిత్రంలో మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక

గుంటూరు జిల్లాలో టీడీపీకి షాక్‌

భట్టిప్రోలు జెడ్పీటీసీతోపాటు పలువురు పార్టీలోకి..

సాక్షి, హైదరాబాద్‌: అనంతపురం జిల్లాలో ఇటీవల వరకు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)గా పనిచేసిన గోరంట్ల మాధవ్‌ శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఆయనకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. తర్వాత మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున వైఎస్సార్‌సీపీలో చేరడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. బీసీలు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలన్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ విధానాల పట్ల ఆకర్షితుడనై పార్టీలో చేరానని తెలిపారు. ఆయన పోరాట పటిమతో స్ఫూర్తిని పొందానని అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మాధవ్‌ 1996 బ్యాచ్‌లో ఎస్‌ఐగా చేరి వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో పనిచేశారు. సీఐ పదవికి రాజీనామా చేసే నాటికి రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 

బాబు చేతిలో మళ్లీ మోసపోవద్దు..
నాలుగున్నరేళ్లపాటు ప్రజా వ్యతిరేక పాలన చేసి ఎన్నికలు మరో మూడు నెలల్లో వస్తున్నాయనగా సీఎం చంద్రబాబు ప్రజలకు, బీసీలకు తాయిలాలు ప్రకటిస్తున్నారని, వీటిని నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.క్రిష్ణప్ప విజ్ఞప్తి చేశారు. నిజంగా చంద్రబాబుకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే పాలనా పగ్గాలు చేపట్టినప్పుడే మేలు చేసేవారని ఇంతకాలం ఎందుకు మిన్నకున్నారనేది ప్రజలు గ్రహించాలన్నారు. బీసీలపై వైఎస్‌ జగన్‌కు నిజమైన ప్రేమ ఉందని, అందుకే బీసీల అధ్యయన కమిటీని వేశారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 142 బీసీ కులాలను ఈ కమిటీ కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుందని తెలిపారు.

గుంటూరు జిల్లాలో టీడీపీకి ఝలక్‌  
గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి తీవ్ర షాక్‌ తగిలింది. టీడీపీ బీసీ, ఎస్సీ నేతలు పలువురు హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో వారంతా జగన్‌ను కలిసి పార్టీలో చేరాలనే అభిలాషను వ్యక్తం చేశారు. భట్టిప్రోలు జడ్పీటీసీ సభ్యురాలు బండారు కుమారి, మండల తెలుగు యువత అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, జిల్లా చేనేత నాయకుడు మనోహర్, భట్టిప్రోలు  పంచాయితీ మాజీ సర్పంచ్‌ కంభం మరియమ్మ తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు.

మరిన్ని వార్తలు