నా నామినేషన్‌ తిరస్కరిస్తే నా భార్య పోటిలో..

25 Mar, 2019 07:13 IST|Sakshi
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గోరంట్ల మాధవ్‌

ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేకనే వీఆర్‌ఎస్‌ ఆమోదానికి అడ్డంకులు

నా నామినేషన్‌ తిరస్కరణకు గురైతే నా భార్య పోటీలో ఉంటారు

వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్‌

అనంతపురం: ‘తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లీడర్‌ కాదు... మేనేజర్‌. ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కొనే ధైర్యంలేక వీఆర్‌ఎస్‌ను ఆమోదించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని వెఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2018 డిసెంబరు 18న నేను రాజీనామా చేశా. 2019 జనవరి 9 నుంచి వీఆర్‌ఎస్‌లో వెళ్లిపోతానని, తన రాజీనామా ఆమోదించాలంటూ అందులో స్పష్టంగా చెప్పా. రాజీనామా లేఖ జిల్లా ఎస్పీ నుంచి కర్నూలు డీఐజీ అక్కడి నుంచి డీజీపీకి వెళ్లింది. వెంటనే రిలీవ్‌ చేయాలంటూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.

ఇంటిలిజెన్స్‌ ఐజీ ఏబీ వెంకటేశ్వరావు ఒత్తిళ్ల మేరకు ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా కర్నూలు డీఐజీ తొక్కి పెడుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. తనకు చేస్తున్న అన్యాయంపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించా. పరిశీలించిన ట్రిబ్యునల్‌ వెంటనే వీఆర్‌ఎస్‌ను ఆమోదించి నామినేషన్‌ దాఖలు చేసేందుకు అడ్డంకులు లేకుండా చూడాలంటూ డీఐజీకి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి డీఐజీ అందుబాటులో లేరు. దీనిపై మళ్లీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశా. స్పందించిన ఆయన ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గోరంట్ల మాధవ్‌ను రిలీవ్‌ చేయాలంటూ డీజీపీకి లేఖ రాశారు.

అయినా ఇప్పటిదాకా ఆయన స్పందించలేదు. ప్రభుత్వం నాపట్ల కక్ష సాధిస్తోంది. ఇన్నిరోజులూ చంద్రబాబు బీసీల ముసుగు వేసుకుని మభ్యపెడుతూ వచ్చారు. వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ టిక్కెట్‌ నాకు ఇచ్చిన తర్వాత టీడీపీకి ఓటమి తప్పదని వివిధ సర్వేల్లో తేలడంతో నన్ను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు బీసీలను అణగదొక్కుతున్నారనేందుకు ఈ ఉదంతమే నిదర్శనం. బీసీల పక్షపాతినని, బీసీ నాయకత్వాన్ని అభివృద్ధి చేస్తామరి చెప్పుకొనే చంద్రబాబు ముసుగు ఈ రోజు తొలగిపోయింది. అసలు రంగు బయపడింది. ఓటమికి చేరువలో ఉన్న చంద్రబాబుకు భయం పట్టుకుంది. వందశాతం ఓడిపోతామనే విషయం ఆయనకూ తెలుసు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎదుర్కొనే ధైర్యం లేక సమస్యలు సృష్టిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు గమనించాలి’ అన్నారు.

నేడు నామినేషన్‌ దాఖలు
తన వద్ద ఉన్న ఉత్తర్వులతో సోమవారం నామినేషన్‌ దాఖలు చేస్తున్నానని, తన భార్య కూడా నామినేషన్‌ దాఖలు చేస్తోందని గోరంట్ల మాధవ్‌ తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల తన నామినేషన్‌ తిరస్కరణకు గురైతే తన భార్య పోటీలో ఉంటారని చెప్పారు. నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. 

మరిన్ని వార్తలు