న్యాయమే గెలిచింది

26 Mar, 2019 09:01 IST|Sakshi
గోరంట్ల మాధవ్‌, భార్య సవిత

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: ధర్మం నిలిచింది...టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా న్యాయం గెలిచింది. కోర్టు మొట్టికాయలతో మేల్కొన్న కర్నూలు రేంజ్‌ డీఐజీ నాగేంద్ర కుమార్‌
సీఐ గోరంట్ల మాధవ్‌ వీఆర్‌ఎస్‌(స్వచ్ఛంద పదవీ విరమణ) ఆమోదిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా గోరంట్ల మాదవ్‌ బరిలో నిలిచేందుకు మార్గం సుగమమైంది.  

అడుగడుగునా అడ్డంకులు 
బీసీ సామాజిక వర్గానికి చెందిన సీఐ గోరంట్లమాధవ్‌ కొన్ని నెలల క్రితమే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వీఆర్‌ఎస్‌ ప్రకటించిన అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలోకి చేరారు. ఈ క్రమంలోనే వై?ఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గోరంట్ల మాధవ్‌ను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో జిల్లాలోని టీడీపీ నాయకుల్లో కలవరం మొదలైంది. సీఐగా ఉంటూ విధి నిర్వహణలోనే అధికారపార్టీ నేతల ఆగడాలను ఎదురించిన వ్యక్తి.. రాజకీయాల్లో పోటీకి వస్తే తమకు పరాభవం తప్పదని కుట్రలు, కుయుక్తులకు తెరలేపారు.

ముఖ్యంగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, మంత్రి పరిటాల సునీతలు పథకం ప్రకారం మాధవ్‌ వీఆర్‌ఎస్‌ ఆమోదించకుండా ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన వీఆర్‌ఎస్‌ ఆమోదించాలని మాధవ్‌... జిల్లా ఎస్పీ, డీఐజీ, డీజీపీలకు ధరఖాస్తులు చేసుకున్నా... పెండింగ్‌లో పెట్టారు. దీంతో గోరంట్ల మాధవ్‌ మాత్రం న్యాయపోరాటానికి దిగారు. తన వీఆర్‌ఎస్‌ ఎందుకు ఆమోదించకుండా అడ్డుపడుతున్నారని ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తాజాగా ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలతో సీఐ గోరంట్ల మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాల్సి వచ్చింది. సీఐ మాధవ్‌ విషయంలో సీఎం చంద్రబాబు, జిల్లా టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.  

చంద్రబాబు.. నీచ రాజకీయాలు మానుకో: మాధవ్‌ 
వీఆర్‌ఎస్‌లో వెళ్లనీయకుండా అడ్డుపడిన సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన వైఎస్సార్‌ సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన తర్వాత ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు.  న్యాయంగా పోరాడాలి, ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలే తప్ప.. నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు. బడుగు బలహీన వర్గానికి చెందిన తనకు వైఎస్సార్‌సీపీ ఎంపీ టికెట్‌ ఇస్తే... ప్రజాక్షేత్రంలో పోటీ ఎదుర్కోలేని టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు  చేశారన్నారు. రెండు దశాబ్దాలుగా పోలీసు శాఖలో తాను పనిచేసినా...కేవలం ప్రభుత్వ ఒత్తిళ్ల మేరకు పోలీసు ఉన్నతాధికారులు కూడా తనను ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమది బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన వ్యవహారంలో ఇలా వ్యవహరించరన్నారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని ధ్వజమెత్తారు. బీసీల సంక్షేమాన్ని కోరుకునే వారంతా వైఎస్సార్‌ సీపీకి మద్దతు తెలపాలని కోరారు.   

మరిన్ని వార్తలు