కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌కు ఝలక్‌

25 Nov, 2018 13:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల వేళ తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. టికెట్‌ ఆశించి భంగపడ్డవారు, అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నవారు.. చివరి నిమిషాల్లో ఆయా పార్టీలకు గుడ్‌ బై చెబుతున్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌ పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌ గొట్టిముక్కల పద్మరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు పంపారు. ఈ లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.

‘పార్టీని ఇల్లులా.. కేసీఆర్‌ను ఇంటి పెద్దదిక్కులా(తండ్రిలా) భావించాను. పార్టీలో ఇన్నాళ్లు చాలా మందికి అన్యాయం జరిగినా ఓపికతో సహించాను. ఇకనైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశించి ఎదురు చూశాను. అయినా.. ఎటువంటి మార్పులేదు. తెలంగాణ వాదం అనే పదాన్ని ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. మీలో మార్పు రాకపోగా.. పార్టీ పక్కదారుల పడుతోంది. ఇక పార్టీ గాడిలో పడదని భావించి పార్టీకి, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌ పదవికి రాజీనామా చేస్తున్నాన’ని ఆయన లేఖలో పేర్కొన్నారు. మరో కొద్ది రోజుల్లో ఎన్నికల జరగనుండగా.. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే గొట్టిముక్కల రాజీనామా చేయడం కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు