ఉద్యోగుల పాలి‘ట్రిక్స్‌’

1 Apr, 2019 10:12 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఉద్యోగం ఊడినట్టేనని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. కొందరు ఉద్యోగ సంఘ నేతలు వాటిని బేఖాతరు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో సన్నిహితంగా ఉంటూ.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.ప్రతిసారీ ఎన్నికలను ఎక్కువగా ప్రభావితం చేసే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నికల నియమావళికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది.

అయితే కొందరు తమ సామాజిక వర్గానికి చెందిన నేతలతోనో.. తమ సంఘానికి అనుకూలమైన రాజకీయ పార్టీతోనో సన్నిహితంగా మెలుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఉద్యోగ సంఘ నేతలపై ప్రత్యేక నిఘా పెట్టింది. నేతలకు తెర వెనుక ఉండి మద్దతు తెలుపుతూ రాజకీయాలు చేస్తే సహించేది లేదని జిల్లా ఎన్నికల అధికారులు స్పష్టం  చేస్తున్నారు. 

తెర వెనుక మద్దతిస్తూ.. 
వాస్తవానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నికల నిబంధనలు పాటించాలి. కానీ జిల్లాలో కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయులు ముఖ్యంగా వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు టీడీపీ అధినేత సామాజికవర్గానికి చెందిన నేతలకు తెర వెనుక మద్దతిస్తూ వస్తున్నారు. ప్రచారంలోనూ సహకారం అందిస్తున్నారు. 
సంఘ నేతలతో టీడీపీ 

నాయకుల మంతనాలు.. 
ఆయా ఉద్యోగ సంఘాల నేతలను ఆకట్టుకుంటే గెలుపు ఖాయమని భావిస్తున్న టీడీపీ నేతలు వారితో రోజూ టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసిన అభ్యర్థులు నిత్యం కొన్ని ఉద్యోగ సంఘాల నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పలువురు సంఘనాయకులు రాత్రివేళల్లో సంఘ భవనాల్లోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో విందులు, వినోదాల్లో మునిగితేలుతూ ఆయా నేతలకు మద్దతివ్వాలని చెబుతూనే అభ్యర్థుల తరఫున ప్రచార వ్యూహాలు రూపొందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉదయం కార్యాలయాల్లో సంతకాలు పెట్టి, ఆ తర్వాత నేతల చెంతకు తుర్రుమంటున్నవారికి లెక్కేలేదు. 

ఎన్నికల సంఘం పటిష్ట నిఘా.. 
ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆగడాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని ఈసీ అధికారులు భావిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి చర్యలు చేపట్టవద్దనీ, ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేశారు. కానీ కొందరు ఉద్యోగ సంఘాల నేతలు పార్టీలవారీగా విడిపోయి పోటీపడి ప్రచారం చేస్తున్నారనే వాదనలు వస్తున్నాయి.  

మరిన్ని వార్తలు