'కూన'కు ప్రభుత్వ ఉద్యోగుల వార్నింగ్‌!

28 Aug, 2019 13:34 IST|Sakshi

క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

చెప్పకపోతే ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిక

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో తాను చెప్పిన పనులు చేయకపోతే చెట్టుకు కట్టేసి కాల్చి చంపుతానంటూ అధికారులను, సిబ్బందిని కూన రవికుమార్‌ తన అనుచరులతో కలిసి బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై మంగళవారం వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. బెదిరింపులకు పాల్పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని, అధికారం పోయినా.. ఆయన వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు లేదని ధ్వజమెత్తుతున్నాయి.

చదవండి: పరారీలో మాజీ విప్‌ కూన రవికుమార్‌

ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల బృందం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి కూనపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేసింది. పంచాయతీ కార్యదర్శుల నుంచి మండల అభివృద్ధి అధికారుల వరకు తాను చెప్పినట్టే నడుచుకోవాలని, లేకుంటే ఇబ్బంది పడతారని కూన రవికుమార్‌ బెదిరించడం ఉద్యోగులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోందని మంత్రి దృష్టికి తెచ్చారు. మంత్రిని కలిసినవారిలో అసోసియేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ బుచ్చిరాజు, సలహాదారు ఎం.ప్రసాద్, జోనల్‌ సెక్రటరీ కె.లోవరాజు ఉన్నారు.

అధికారులు, సిబ్బందిపై దౌర్జన్యం చేసిన కూనను వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గుంటూరులోని ఎన్‌జీవో హోమ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కూన రవికుమార్‌ టీడీపీ కార్యకర్తలతో ఎంపీడీవో ఆఫీస్‌లోకి దూసుకెళ్లి, దౌర్జన్యంగా తలుపులు పగులకొట్టి అధికారులను, సిబ్బందిని చెట్టుకు కట్టేసి కాలుస్తానని హెచ్చరించడాన్ని తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఎవరూ ఈ తరహా బెదిరింపులకు పాల్పడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

కూన తక్షణమే ఎంపీడీవో దామోదర్‌కు, అక్కడి ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు న్యాయం జరగకపోతే కూన ఇల్లు ముట్టడించడంతోపాటు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, సహాధ్యక్షుడు పురుషోత్తమ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి కె.జగదీశ్వరరావు, తూర్పు కృష్ణా అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు బాజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా