నెలాఖరులోగా పురపాలక చట్టం!

12 Jun, 2019 02:46 IST|Sakshi

నేడు ముఖ్యమంత్రి అధ్యక్షతన కీలక సమావేశం

జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వేర్వేరు చట్టాలు

సాధ్యమైనంత త్వరగా మున్సి‘పోల్స్‌’ నిర్వహించే యోచన   

సాక్షి, హైదరాబాద్‌: మునిసిపల్‌ ఎన్నికలకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. సాధ్యమైనంత త్వరగా పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త మునిసిపల్‌ చట్టానికి తుదిరూపునిస్తున్న సర్కారు.. ఈ నెలాఖరులోగా దీనికి ఆమోదముద్ర వేయాలని భావిస్తోంది. నూతన చట్టం మనుగడలోకి వచ్చిన అనంతరం ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. వాస్తవానికి ఈ నెలలో పురపోరు నిర్వహిస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ, కొత్త చట్టం కొలిక్కిరాకపోవడంతో ఆలస్యమైంది. వచ్చే నెల 2వ తేదీతో పురపాలక సంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది.

మున్సిపాలిటీ పాలక కమిటీల గడువు దగ్గరపడుతున్నా.. ఇప్పటివరకు వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల క్రతువు మొదలు పెట్టకపోవడంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం, బీసీ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్న సర్కారు.. అతి త్వరలో మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం కొత్త పుర చట్టంలో పొందుపరచాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమావేశంలోనూ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై చర్చకు వచ్చినట్లు తెలిసింది.  

నెలాఖరులోగా కొత్త చట్టం!
ముసాయిదా పురపాలక చట్టానికి మునిసిపల్‌ శాఖ తుదిమెరుగులు దిద్దుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారుల బృందాలు కొత్త చట్టానికి పదునుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించడం, అవినీతిరహిత పాలన అందించేందుకు చట్టంలో పొందుపరిచే అంశాలపై సోమవారం జరిగిన సమావేశంలో సీఎం వివరించారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు, నిధుల వినియోగంలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. అవినీతి కేంద్రబిందువుగా మారిన పట్టణ ప్రణాళికను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేలా చట్టాన్ని కఠినతరం చేయాలని నిర్దేశించారు. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులపై వేటు వేసేలా చట్టంలో చేర్చనున్నట్లు తెలిసింది.

ఒకే చట్టమా..వేర్వేరు చట్టాలా?
అంతేగాకుండా.. తొలుత అనుకున్నట్లు ఏకీకృత పుర చట్టంగాకుండా.. వేర్వేరు చట్టాలను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలకు వేర్వేరు చట్టాలున్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని గతంలో జరిగిన సమావేశాల్లో సీఎం సూచించారు. తాజాగా పాత చట్టాలనే కొనసాగిస్తూ... మార్పులు, చేర్పులు చేయాలని సూచించినట్లు తెలిసింది.

అవసరమైతే ఒకే చట్టాన్ని తీసు కొచ్చి.. ఆయా సంస్థల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేసే అంశాన్ని పరిశీలించాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం, చేయాల్సిన సవరణలు ఇతరత్రా అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.  

ఆగస్టులో పురపోరు..
కొత్త చట్టం కార్యరూపం దాల్చిన అనంతరం పురపోరుకు నగారా మోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరులో జరగనున్న శాసనసభ సమావేశంలో నూతన చట్టానికి ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. అనంతరం వార్డుల పునర్విభజన, అభ్యంతరాలను స్వీకరించిన పిమ్మట మున్సిపోల్స్‌కు వెళ్లనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా సంకేతాలిచ్చారు. సాధ్యమైనంత త్వరగా పురపాలికలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నామని, కొత్త చట్టం అమలులోకి రావడమే తరువాయి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు అధికారవర్గాలకు తెలియజేశారు.  

మరిన్ని వార్తలు