పార్టీ పనులకు ప్రభుత్వ ఉద్యోగాలు

14 Jun, 2018 02:41 IST|Sakshi

సాధికార మిత్ర పేరుతో టీడీపీ ఎన్నికల మిత్రల నియామకం

వచ్చే ఎన్నికల్లో నెగ్గేందుకు అధికార పార్టీ కుటిల వ్యూహం 

ప్రతి 35 ఇళ్లకు ఒక సాధికార మిత్ర నియామకం 

కుటుంబాల సమగ్ర సమాచారం సేకరణ

ప్రతిపక్షాలపై దుష్ప్రచారమే లక్ష్యం 

మిత్రల బ్యాంకు ఖాతాల వివరాలు ప్రభుత్వం చేతికి.. ఓటర్లకు డబ్బులు పంచేందుకు పన్నాగం

సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కుతోంది. జన్మభూమి కమిటీల పేరుతో ఇప్పటికే స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమకు అనుకూలంగా ఉండే డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించుకుని, నిస్సిగ్గుగా పార్టీ పనులకు వాడుకుంటోంది. ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తామంటూ మహిళలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం బహూశా ఎక్కడా ఉండదేమో! టీడీపీ ప్రచారానికి, అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో గెలవడానికి 4.46 లక్షల మంది డ్వాక్రా మహిళలను ప్రభుత్వం సాధికార మిత్రలుగా నియమించింది. వీరు పూర్తిస్థాయిలో అధికార పార్టీ ఏజెంట్లుగా పనిచేయనున్నారు. సాధికార మిత్రల శిక్షణకు, ప్రతినెలా వీరితో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిం చేందుకు అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే చెల్లిస్తుండడం గమనార్హం. 

టీడీపీకి ఓట్లు వేయించాలట! 
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడమే సాధికార మిత్రల విధి అని పైకి చెబుతున్నా.. అసలు పని మాత్రం వేరే ఉంది. ముఖ్యమంత్రి అప్పగించిన విధి ఏమిటంటే.. సాధికార మిత్రలు తమకు కేటాయించిన 35 కుటుంబాల సమగ్ర సమాచారాన్ని స్థానిక టీడీపీ నేతలకు చేరవేయాలి. ఆయా కుటుంబాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. ప్రభుత్వ ఘనకార్యాలను వివరిస్తూనే ప్రతిపక్షాల గురించి వీలైనంత మేర దుష్ప్రచారం సాగించాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓట్లు వేసేలా జనాన్ని సన్నద్ధం చేయాలి. అంతేకాకుండా సాధికార మిత్రల బ్యాంకు ఖాతాల వివరాలను ప్రభుత్వం సేకరించినట్లు తెలిసింది. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో వారి బ్యాంకు ఖాతాలకు భారీ మొత్తంలో నగదును బదిలీ చేసి, ఆ సొమ్మంతా సాధికార మిత్రల పరిధిలోని కుటుంబాలకు చేరేలా వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. సాధికార మిత్రలకు త్వరలో సర్కారు ఖజానా నుంచే వేతనాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. 

4.46 లక్షల మంది నియామకం 
రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పల్స్‌ సర్వేలో 1,32,28,199 కుటుంబాలు తమ వివరాలను నమోదు చేసుకున్నాయి. ఆయా కుటుంబాలను 35 చొప్పున ఒక క్లస్టర్‌గా 4,66,624 క్లస్టర్లుగా వర్గీకరించారు. అందులో 4,46,529 క్లస్టర్లకు నాలుగు నెలల క్రితమే సాధికార మిత్రలను ప్రభుత్వం నియమించింది. సాధికార మిత్రల శిక్షణకు, ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు రాకపోకలకు దారి ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. 4.46 లక్షల మంది సాధికార మిత్రలకు శిక్షణ ఇవ్వడానికి, ప్రతినెలా వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించేందుకు అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే చెల్లిస్తున్నారు. 

ఎన్‌ఆర్‌ఎల్‌ఎం నిధులకు ఎసరు 
పొదుపు, స్వయం ఉపాధి అవకాశాలపై డ్వాక్రా మహిళల్లో అవగాహన పెంచే కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా అన్ని రాష్ట్రాలకూ నిధులు అందజేస్తోంది. వీటిని ఎన్‌ఆర్‌ఎల్‌ఎం నిధులు అంటారు. కేంద్రం గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు రూ.57 కోట్లు ఇచ్చింది. ఈ ఏడాది మరో రూ.47 కోట్లు ఇచ్చేందుకు అనుమతి తెలిపింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. సాధికార మిత్రల శిక్షణకు, జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటనలకు వారు హాజరయ్యేందుకు ఖర్చు పెడుతోంది. ముఖ్యమంత్రి నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రతినెలా 300 మంది సాధికా>ర మిత్రలను జిల్లాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. కేంద్రమిచ్చే ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్‌ నిధులనే ఇందుకోసం ఖర్చు చేస్తున్నారు. సాధికార మిత్రల రవాణా ఖర్చులకు కేంద్రమిచ్చే నిధులనే వాడుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 

అధికార పార్టీ అనుకూలురే మిత్రలు 
సాధికార మిత్రలుగా ఎవరిని నియమించాలి? అనేదానిపై ప్రభుత్వ పెద్దలు ముందుగానే జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు, చర్యలపై వ్యతిరేక భావం ఉన్న డ్వాక్రా మహిళలను నియమించవద్దని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వారినే సాధికార మిత్రలుగా నియమించాలని దిశానిర్దేశం చేశారు. స్థానికంగా ఉండే టీడీపీ నేతలు కూడా తమకు అనుకూలమైన వారే సాధికార మిత్రలుగా ఎంపికయ్యేలా జాగ్రత్త పడ్డారు. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో ముఖ్యమంత్రి సెక్రటరీగా పనిచేస్తున్న ఓ అధికారి ఈ నెల 11వ తేదీన విజయవాడలో కొందరు సాధికార మిత్రలతో గోప్యంగా సమావేశం నిర్వహించారు. 

ఓట్లు కొల్లగొట్టే కుతంత్రం  
రాష్ట్రంలో ప్రతి కుటుంబం వివరాలను ప్రభుత్వం ఇప్పటికే పల్స్‌ సర్వేలో సేకరించింది. ఇప్పుడు సాధికార మిత్రల ద్వారా కుటుంబాల వారీగా సమగ్ర సమాచారం రాబడుతోంది. కులం, కుటుంబానికి ఉన్న భూమి, ఆ కుటుంబం వివిధ పథకాల కింద ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధి వంటి వివరాలను సేకరిస్తోంది. దీనిద్వారా సదరు కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏమిటి? వారి ఓట్లు కొల్లగొట్టాలంటే ఏం చేయాలన్నది టీడీపీ నేతలకు తెలిసిపోనుంది. 

డ్వాక్రా మహిళలే కాబట్టి కేంద్ర నిధులు వాడుతున్నాం..  
‘‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రచారం చేయడానికే సాధికార మిత్రలను నియమించింది. వీరంతా డ్వాక్రా మహిళలే కాబట్టి కేంద్రమిచ్చే ఎన్‌ఆర్‌ఎల్‌ఎం నిధులను సాధికార మిత్రల శిక్షణ కోసం ఖర్చు పెడుతున్నాం’’ 
– కృష్ణమోహన్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) సీఈవో  

మరిన్ని వార్తలు