సీఎం మమతా నన్ను అవమానించారు : గవర్నర్‌

15 Oct, 2019 17:29 IST|Sakshi

కోల్‌కతా : దుర్గా పూజ వేడుకల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనను ఘోరంగా అవమానించారని ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీఫ్‌ ధంఖర్‌ ఆరోపించారు. వేదికపై తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని మనస్తాపం చెందారు. ఇటీవల  ప్రభుత్వ ఆధ్వర్యంలో దుర్గాపూజా వేడుకల్లో సీఎం మమతాతో పాటు గవర్నర్‌ ధంఖర్‌కూడా హాజరయ్యారు. వేదిక కార్నర్‌లో అతనికి సీటు కేటాయించారు. నాలుగు గంటల పాటు సాగిన ఈ వేడుకల్లో గవర్నర్‌ తనకు కేటాయించిన సీటులోనే కూర్చొని ఉన్నారు. ఈ విషయాన్ని మీడియా కూడా బయటపెట్టలేదు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై ఒక్కసారి కూడా గవర్నర్‌ ముఖాన్ని చూపించలేదు. 

ఈ ఘటనపై గవర్నర్‌  మీడియాతో మాట్లాడుతూ.. ‘ దుర్గాపూజ వేడుకల్లో అవమానానికి గురయ్యాను. చాలా మనస్తాపం చెందాను. ఓ గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ముఖ్యమంత్రి నాకు ఇవ్వలేదు.  వేదిక చివర్లో నాకు సీటు కేటాయించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్లలో నేను ఒక్కసారి కూడా కనిపించలేదు. అవమానం జరిగింది నాకు ఒక్కడికే కాదు. బెంగాల్‌ ప్రజలందరిని మమతా  అవమానించారు. నేను ప్రజల సేవకుడిని.. రాజ్యాంగబద్దంగా నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని అభినందిన్నాను.  నాకు జరిగిన అవమానాన్ని ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకుంటుందని ఆశిస్తున్నా’ అని గవర్నర్ జగదీప్ ధంఖర్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు