ఉత్కంఠగా మారిన మహారాష్ట్ర రాజకీయాలు

8 Nov, 2019 19:08 IST|Sakshi

సీఎం పదవికి ఫడ్నవిస్‌ రాజీనామా

ఎన్సీపీ, హస్తం మద్దతు కోరుతున్న సేన

రాష్ట్రపతి పాలన తప్పదంటున్న విశ్లేషకులు

సాక్షి, ముంబై: దేశమంతా ఆసక్తిగా పరిశీలిస్తున్న మహారాష్ట్ర రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నేడు (శుక్రవారం) అర్ధరాత్రితో ముగియనుండటంతో ఫడ్నవిస్‌ రాజీనామా చేయక తప్పలేదు. ఎన్నికల ఫలితాలు విడుదలై 15 రోజులు గడుస్తున్నా.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చినా.. సీఎం పీఠం, పదవుల పంపకాలు ఇరు పార్టీల మధ్య చిచ్చుపెట్టాయి. దీంతో బీజేపీ-శివసేన నేతల మధ్య ఘర్షణ వాతావరణ ఏర్పడి.. ప్రభుత్వ ఏర్పాటులో  ఎటూ తేల్చుకోలేకపోయాయి. సీఎం పీఠంపై 50:50 ఫార్ములా అనుసరించాలని శివసేన చేసిన విజ్ఞప్తిని బీజేపీ నేతలు తొసిపుచ్చారు. ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతాని ఫడ్నవిస్‌ స్పష్టంచేశారు. ఈ పరిణాల నేపథ్యంలోనే అసెంబ్లీ గడవు ముగియడంతో  సీఎం పదవిని ఫడ్నవిస్‌ రాజీనామా చేశారు. అయితే  గవర్నర్‌ తదుపరిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర రాజకీయాల అడుగులు ఎటువైపు పడతాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

సీఎం పీఠంపై శివసేన..!
అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అవకాశం ఇస్తారా? లేక రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా? అనేది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కొత్త చర్చ కూడా ముంబై రాజకీయ వర్గల్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి సరైన మెజార్టీ లేకపోవడంతో శివసేన విజ్ఞప్తి మేరకు వారికి అవకాశం ఇస్తారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో తమకు సహకరించాలని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఇదివరకే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కోరిన విషయం తెలిసిందే. ఎన్సీపీతో పాటు కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలిపితే సీఎం పీఠంపై శివసేన కూర్చోవాలని పావులు కదుపుతోంది. అయితే రౌత్‌ ప్రతిపాదనపై స్పందించిన పవార్‌.. వెంటనే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వివరించారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం సానుకూల స్పందన రాలేదు. అంతేకాక ప్రజలిచ్చిన తీర్పు మేరకు ప్రతిపక్షంలోనే కూర్చుంటాని పవార్‌ తేల్చిచెప్పారు. అయినా వెనక్కి తగ్గని శివసేన.. బీజేపీకి చెక్‌పెట్టాలని ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నంలో బీజేపీపైకి ఎదురుదాడి ప్రారంభించింది. రాజీనామా సందర్భంగా ఫడ్నవిస్‌ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఉద్దవ్‌ ఠాక్రే.. దానికి కౌంటర్‌గా గట్టి సమాధానమిచ్చారు. జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ కలిసినప్పుడు, తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ఎందుకు కలవకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం పీఠం కోసం ఠాక్రే గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 
చదవండి: సీఎం పదవికి ఫడ్నవిస్‌ రాజీనామా

కాషాయ వికాసం కష్టమే..
రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ఫడ్నవిస్‌ ప్రకటించగా.. తమకు 170 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని, బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన గట్టిగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గవర్నర్‌కు సవాలుగా మారింది. శివసేనను తప్పించి అతిపెద్దపార్టీగా ఆవిర్భవించిన బీజేపీ తొలతు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావచ్చు. బీజేపీ వద్ద 105 మంది ఎమ్మెల్యేలుండగా మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం 40 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. దీంతో అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. బీజేపీ విశ్వాస పరీక్షలో నెగ్గకుంటే రెండో పెద్ద పార్టీగా శివసేన అధికారం కోసం ముందుకువచ్చే అవకాశాలున్నాయి. ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 ఎమ్మెల్యేలతోపాటు ఇతరుల సాయంతో అవసరానికి మించి 170 వరకు సంఖ్యాబలం చేరవచ్చు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది. కానీ, మూడు వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీలతో ముందుకెళ్లడం అసాధ్యంగా కనిపిస్తోంది. అధికారాన్ని వాడుకుని, ప్రలోభాలకు గురి చేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఫడ్నవీస్‌కు ప్రస్తుతం అదేమంత సులభం కాదని చెప్పవచ్చు.

రాష్ట్రపతి పాలన విధించే అవకాశం
అయితే తాజా పరిస్థితులపై విశ్లేషించిన పలువురు రాజకీయ ప్రముఖులు మాత్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ-శివసేన మధ్య సయోధ్య కుదిరే వరకు (కొంతకాలం)పాటు రాష్ట్రపతి పాలను కొనసాగించి ఆ తరువాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అప్పటికీ శివసేన పట్టువీడకపోతే గవర్నర్‌ విచక్షణాధికారం ప్రకారం శివసేనను ఆహ్వానించే అవకాశం ఉంది. సేనకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతు తెలుపుతాయా లేదా అనేది వేచి చూడాలి. కానీ పలువురు బీజేపీ నేతలు ప్రకటించిన విధంగా రీ ఎలక్షన్‌ (మరోసారి ఎన్నికలు)కు వెళ్లకపోవచ్చ. రీ ఎలక్షన్‌ పెద్ద మొత్తంలో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అటు దిక్కుగా నిర్ణయం తీసుకోకపోచ్చని సమాచారం. మొత్తం మీద దేశ  ఆర్థికి రాజధాని ముంబై రాజకీయాలు రోజురోజుకు  ఉత్కంఠగా మారుతున్నాయి.

మరిన్ని వార్తలు