ఏపీ సర్కార్‌కు చుక్కెదురు!

30 Jan, 2019 10:20 IST|Sakshi

చుక్కల భూముల ఆర్డినెన్స్‌ను తిరస్కరించిన గవర్నర్‌

సాక్షి, అమరావతి : చుక్కల భూముల విషయంలో ఏపీ సర్కార్‌కు చుక్కలు కనబడుతున్నాయి. ఈ చుక్కల భూముల ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ నరసింహన్ తిరస్కరించారు. సమస్యను పరిష్కరించే దిశగా ఆర్డినెన్స్‌ లేదని ప్రభుత్వానికి సూచించారు. జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీల మార్పులను తప్పబడుతూ రెండు ఆర్డినెన్స్‌ల్లో ఒకటిని తిరస్కరించారు. ఇక 2 నెలల పరిష్కార సమయం పెట్టడాన్ని కూడా గవర్నర్‌ తప్పుబట్టారు. కేవలం అసైన్‌మెంట్‌ ఆర్డినెన్స్‌ను మాత్రమే ఆమోదించారు. దీంతో ఫిబ్రవరి 6న చుక్కల భూముల బిల్లును అసెంబ్లీలో పెట్టాలని భావించిన ప్రభుత్వం పునరాలోచనలో పడింది. 

స్వాతంత్య్రానంతరం రెవెన్యూ రికార్డులను తిరగరాసే సమయంలో కొన్ని సర్వే నంబర్లకు చెందిన భూమి ప్రభుత్వానిదా? ప్రైవేటు వ్యక్తులదా అన్న విషయం తేలలేదు. దీంతో ఆ భూముల రికార్డుల్లో హక్కుదారు కాలమ్‌లో చుక్క పెట్టి వదిలేశారు. వీటినే చుక్కల భూములుగా పిలుస్తారు. ఈ చుక్కల భూముల విషయంలో అధికారులు తనకే చుక్కలు చూపిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

చుక్కల భూములుగా నమోదైన లక్షలాది ఎకరాలపై తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ల  కన్ను పడింది. అడంగల్‌లను తారుమారు చేసి, తామే అనుభవదారులుగా చూపించి, వాటన్నింటినీ సొంతం చేసుకొనే వ్యూహంలో టీడీపీ నేతలు ఉన్నారు.  శాసన సభలో బిల్లు ద్వారా ఈ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నేతలు ఈ భూముల అనుభవదారులుగా తమ పేర్లను నమోదు చేయిస్తున్నారు. బిల్లు ఆమోదం పొంది, చట్ట రూపం దాల్చేలోగా రికార్డుల్లో ఈ భూములకు అనుభవదారులుగా పేర్లు చేర్చడం ద్వారా వాటిని సొంతం చేసుకునేలా టీడీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

మరిన్ని వార్తలు