వీడియో ఫుటేజీకి సభ తీర్మానం అవసరం

23 Mar, 2018 03:33 IST|Sakshi

మరింత గడువివ్వండని కోరిన ఏఏజీ.. అంగీకరించిన హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకుని ఈ నెల 12న గవర్నర్‌ ప్రసంగం నాటి వీడియో ఫుటేజీలను తీసుకునేందుకు శాసనసభ తీర్మానం అవసరమని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) గురువారం హైకోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలో వీడియో ఫుటేజీలను సమర్పించేందుకు మరింత గడువు కావాలని కోరారు. ఈ నెల 22న ఫుటేజీని తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అడ్వొకేట్‌ జనరల్‌ దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి ఈ విషయంపై అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారని ఆయన తెలిపారు.

దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు వీడియో ఫుటేజీల సమర్పణకు ఈ నెల 27 వరకు గడువునిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతో పాటు, నల్లగొండ, అలంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలును నిలిపేయాలని కోరుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.సంపత్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు