కశ్మీర్‌ అసెంబ్లీ రద్దు అన్ని విధాల తప్పే!

24 Nov, 2018 12:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీని హఠాత్తుగా రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ బుధవారం నాడు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరమే కాకుండా చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని కూడా చెప్పవచ్చు. జమ్మూ కశ్మీర్‌ రాజ్యాంగంలోని అధికరణ 53 (2బీ) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. అయితే అది భారత రాజ్యాంగంలోని 172 (2బీ) అధికరణలోని అంశాలకు అనుగుణంగా ఉండాలి. సత్యపాల్‌ మాలిక్‌ తీసుకున్న నిర్ణయం అందుకు భిన్నంగా ఉండడమే కాకుండా, ఇలాంటి సందర్భాల్లో పరిగణలోకి తీసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు గతంలో సూచించిన మార్గదర్శకాలకు కూడా భిన్నంగా ఉంది. 

ఓ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అంశంలో హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలంటూ సూచిస్తున్న భారత రాజ్యాంగంలోని 172 (2బీ) అధికరణంలో అంత స్పష్టత లేకపోవచ్చేమోగానీ ‘ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ భారత ప్రభుత్వం’ కేసులో 1994, మార్చి 11న, ఆ తర్వాత ‘రామేశ్వర ప్రసాద్‌ వర్సెస్‌ భారత ప్రభుత్వం’ కేసులో 1996, జనవరి 24వ తేదీన సుప్రీం కోర్టు స్వయంగా ఇచ్చిన తీర్పుల్లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ తీర్పుల ప్రాతిపదికనే కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ, ఎన్‌సీపీలు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. 

పరస్పర భిన్న విధానాలు కలిగిన ఈ పార్టీల మధ్య సరైన సఖ్యత ఉండదని, అవి స్వార్థ ప్రయోజనాలకు కోసం అక్రమ పద్ధతిలో కూటమిగా చేతులు కలపవచ్చని గవర్నర్‌ మాలిక్‌ భావించడం, అందుకని సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేవని అనుకోవడం, అందుకని రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తున్నానని ప్రకటించడం అర్థరహితం. భారత్‌ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చిన పార్టీలకు తగిన సంఖ్యా బలం ఉందా, లేదా అన్నదే  తప్ప, వాటి సిద్ధాంతాలు, విధానాలు ఏమిటీ? అని చూడాల్సిన అవసరం లేదు. అలా చూసిన సందర్భాలు కూడా లేవు. అంతకుముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ–పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీల విధానాలు పరస్పర భిన్నమైనవి కావా? ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా? అందుకే ఆ ప్రభుత్వం ఎక్కువకాలం నిలబడలేదనుకుంటే, ఈ పార్టీలకు కూడా ఓ సారి అవకాశం ఇచ్చి చూస్తే వచ్చే నష్టం ఏముంది?

ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చిన పార్టీలకు సరైన సంఖ్యా బలం ఉందా, లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు సంఖ్యాబలాన్ని తనిఖీ చేయవచ్చు, ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేల బేరసారాలకు పాల్పడతారని అనుమానించిన సందర్భాల్లో 24 గంటల్లోగా విశ్వాస పరీక్షను కోరవచ్చు. అలాంటి సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ‘కనిపించని చీకటిలో జరిగే బేరసారాల ద్వారా ముడుపులు తీసుకొని ఓ పార్టీకి లేదా కూటమికి మద్దతు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారని  ఓ గవర్నర్‌ అనుమానించడం, భావించడం తప్పు. అందుకు స్పష్టమైన ఆధారాలు ఉండాలి. అప్పుడే ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా లేకపోవడమో, అనవసరమైన ఖర్చు ఎందుకనో, మరే కారణంగానో భిన్న విధానాలు, సిద్ధాంతాలు కలిగిన పార్టీలకు కూడా మద్దతుకు ముందుకు రావచ్చు. ఓ పార్టీ నాయకుడు ఒప్పుకోకపోయినా, అందుకు భిన్నంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతివ్వవచ్చు’ అని రామేశ్వర ప్రసాద్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 

అంతేకాకుండా ‘ఈ కారణంగా అసెంబ్లీని రద్దు చేయవచ్చనే ఉద్దేశంతో అసెంబ్లీ రద్దుకు గవర్నర్‌ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయా, లేవా అన్న విషయాన్ని పరిశీలించాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం లేదని సుస్పష్టంగా భావించినప్పుడు మాత్రమే అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకోవాలి’ అని ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ రెండు తీర్పుల కారణంగా కశ్మీర్‌ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్‌ మాలిక్‌ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు రేపు తప్పు పట్టవచ్చు. అంత మాత్రాన అసెంబ్లీని గవర్నర్‌ పునరుద్ధరిస్తారని భావించలేం. అలా పునరుద్ధరిస్తే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందని గవర్నర్‌ భావించవచ్చు. గవర్నర్‌ నిర్ణయం తప్పో, ఒప్పో చెబుతానుగాని, రాజ్యాంగపరంగా ఆయన నిర్వహించాల్సిన విధుల్లో తాను జోక్యం చేసుకోనని సుప్రీం కోర్టు చెబుతుంది. 

అందుకనే గతంలో ఓ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టినా, ఆ అసెంబ్లీని పునరుద్ధరించకపోగా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటయింది. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవడం దేశంలోని గవర్నర్లకు అలవాటుగాను, పరిపాటుగాను మారిపోయింది. అందుకే అప్పుడప్పుడు గవర్నర్‌ వ్యవస్థ రద్దు చేయాలనే నినాదం బయటకు వస్తుంది. దీన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏదోనాడు సుప్రీం కోర్టే జోక్యం చేసుకోవాలేమో!?

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా