కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన

21 Jun, 2018 01:27 IST|Sakshi
పోలీస్, నిఘా, ఆర్మీ అధికారులతో భద్రతపై సమీక్ష జరుపుతున్న గవర్నర్‌ వోహ్రా

రాష్ట్రంలో ఎనిమిదోసారి అమల్లోకి

అసెంబ్లీని సుప్తచేతనావస్థలో పెట్టిన గవర్నర్‌

వెంటనే ఎన్నికలు జరపాలని ఒమర్‌ అబ్దుల్లా డిమాండ్‌

కొత్త సీఎస్‌గా తెలుగు వ్యక్తి

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో ఎనిమిదోసారి గవర్నర్‌ పాలన మొదలైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఉదయమే జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్‌ పాలనకు ఆమోదం తెలిపారు. ఆ వెంటనే గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా విధుల్లోకి దిగారు. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మరోవైపు గతంలో మాదిరిగానే కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు కొనసాగుతాయని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ చెప్పారు. అలాగే కశ్మీర్‌లో ఉగ్రవాదం అంతమై శాంతి నెలకొనాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. మరోవైపు ఇటీవలే ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన జవాను ఔరంగజేబు కుటుంబాన్ని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పరామర్శించారు. ఔరంగజేబు లాంటి వాళ్లు మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తారని ఆమె శ్లాఘించారు.

మూడేళ్లకుపైగా కొనసాగిన పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి మంగళవారం అనూహ్యంగా బీజేపీ బయటకు రావడంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో గవర్నర్‌ పాలనకు సిఫారసు చేస్తూ జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా మంగళవారమే రాష్ట్రపతి భవన్‌కు నివేదిక పంపారు.

అయితే ఆ సమయంలో కోవింద్‌ విమాన ప్రయాణంలో ఉండటంతో తెల్లవారు జామున 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఆయన సూరినామ్‌లో విమానం దిగగానే అధికారులు గవర్నర్‌ నివేదికను పరిశీలనకు పంపారు. జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్‌ పాలనకు ఆమోదం తెలుపుతున్నట్లు ఉదయం 6 గంటలకల్లా రాష్ట్రపతి నుంచి హోం మంత్రిత్వ శాఖకు సమాచారం వచ్చింది.

ఆ వెంటనే ఆదేశాలను శ్రీనగర్‌కు పంపగా, రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉంటుందని గవర్నర్‌ ప్రకటించారు. ‘రాష్ట్రపతి ఆమోదం వచ్చిన వెనువెంటనే.. జమ్మూ కశ్మీర్‌ రాజ్యాంగంలోని సెక్షన్‌ 92 కింద గవర్నర్‌ పాలనను అమలు చేస్తున్నట్లు ఎన్‌ఎన్‌ వోహ్రా ప్రకటించారు’ అని రాజ్‌భవన్‌ ప్రతినిధి తెలిపారు.

ప్రధాన కార్యదర్శితో గవర్నర్‌ చర్చలు
అనంతరం జమ్మూ కశ్మీర్‌ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) బీబీ వ్యాస్‌తో గవర్నర్‌ వోహ్రా చర్చలు జరిపారు. ఆ తర్వాత పౌర, పోలీసు, అటవీ తదితర విభాగాల అధికారులతోనూ వోహ్రా భేటీ అయ్యారు. ‘రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం వేగంతో, సమర్థంగా, జవాబుదారీతనంతో పనిచేసేలా చూసేందుకు గవర్నర్‌ అధికారులతో మాట్లాడారు’ అని రాజ్‌భవన్‌ ప్రతినిధి చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించడం గత నాలుగు దశాబ్దాల్లో మొత్తంగా ఇది ఎనిమిదోసారి కాగా, వోహ్రా హయాంలోనే నాలుగోసారి.

బేరసారాలకు అవకాశం: ఒమర్‌
సుప్తచేతనావస్థలో ఉన్న జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీని వెంటనే రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ నేత ఒమర్‌ అబ్దుల్లా కోరారు. లేకపోతే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొని బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందనీ, సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కవీందర్‌ గుప్తా స్వయంగా ఈ విధమైన సంకేతాలిచ్చారని ఒమర్‌ ఆరోపించారు.

గవర్నర్‌ పాలనపై మిశ్రమ స్పందన
కాగా పీడీపీ–బీజేపీ ప్రభుత్వం కూలిపోయినందుకు కశ్మీర్‌లోని శ్రీనగర్, కుప్వారా, పహల్గామ్‌ తదితర ప్రాంతాల్లో ప్రజలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. పీడీపీ–బీజేపీల కూటమి అపవిత్రమైనదనీ, బీజేపీతో పీడీపీ కలవకుండా ఉండాల్సిందని పలువురు పేర్కొన్నారు.

అయితే గవర్నర్‌ పాలనలో పారదర్శకత కొరవడుతుందనీ, రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తంచేశారు. గవర్నర్‌ పాలన కన్నా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఎప్పటికైనా మెరుగైన పాలన అందిస్తుందన్నారు.

అమర్‌నాథ్‌ యాత్రకు భద్రతా ఏర్పాట్లు
అమర్‌నాథ్‌ యాత్ర ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు జమ్మూ ఐజీ ఎస్‌డీ సింగ్‌ జమ్వాల్‌ నేతృత్వంలో పోలీసులు, పారామిలిటరీ దళాలు, కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థల అధికారులతో ఉన్నత స్థాయి భేటీ జరిగింది.

అధికారులంతా అత్యంత అప్రమత్తంగా ఉండి, అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేయాలనీ, సంఘవిద్రోహ శక్తుల కుట్రలను నీరుగార్చాలని ఈ సమావేశంలో ఐజీ ఆదేశించారు. సరిహద్దుల్లోని పోలీస్‌ స్టేషన్లు, సైనిక శిబిరాలు, చెక్‌పాయింట్లలోని సిబ్బంది జాగ్రత్తగా పనిచేస్తూ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తే వెంటనే వారిని అంతమొందించాలని సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి.

షాక్‌లో మెహబూబా
సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగాలని బీజేపీ తీసుకున్న అనూహ్య నిర్ణయం.. ఆ నిర్ణయాన్ని తనకు తెలియజేసిన తీరుతో మంగళవారం మాజీ సీఎం (బీజేపీ నిర్ణయంతో మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేశారు) మెహబూబా ముఫ్తీ షాక్‌కు గురయ్యారని పీపుల్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ) వర్గాలు తెలిపాయి. పలు అంశాల్లో బీజేపీ– పీడీపీల మధ్య విభేదాలున్నా, ఇంత అకస్మాత్తుగా ప్రభుత్వం నుంచి వైదొలగాలన్న నిర్ణయం బీజేపీ తీసుకుంటుందని ఆమె ఊహించలేదన్నాయి.

‘ఆమె బీజేపీ మోసం చేసిందన్న భావనలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఎవరితోనూ మాట్లాడటం లేదు’ అని  పీడీపీ నేత ఒకరు తెలిపారు. పార్టీని బలోపేతం చేయడంలోనూ, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంలోనూ కీలకపాత్ర పోషించిన ఆమె అప్పుడు బీజేపీ వ్యతిరేక వైఖరిని బాహాటంగానే చూపేవారు. పీడీపీకి గట్టి పట్టున్న దక్షిణ కశ్మీర్‌ ప్రాంతం.. బీజేపీతో పొత్తు వల్ల ఇప్పుడు పట్టుకోల్పోయిందన్నారు.


కశ్మీర్‌ కొత్త సీఎస్‌గా సుబ్రమణ్యం
జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బీవీఆర్‌ సుబ్రమణ్యం నియమితులయ్యారు. అలాగే ప్రస్తుత సీఎస్‌ బీబీ వ్యాస్‌తోపాటు ఐపీఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ను గవర్నర్‌ వోహ్రాకు సలహాదారులుగా కేంద్రం నియమించింది.

1987 బ్యాచ్‌ ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌కు చెందిన సుబ్రమణ్యంను ఛత్తీస్‌గఢ్‌లో అదనపు ప్రధాన కార్యదర్శి (హోం శాఖ)గా పనిచేస్తుండగా.. ఆయనను జమ్మూ కశ్మీర్‌కు పంపేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ కమిటీ మంగళవారం రాత్రే ఆమోదం తెలిపింది. అంతర్గత భద్రతా విషయాల్లో మంచి పట్టున్న వ్యక్తిగా సుబ్రమణ్యంకు పేరుంది. 2004–08లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా ఆయన పనిచేశారు.

2008 జూన్‌ నుంచి 2011 సెప్టెంబరు వరకు ప్రపంచ బ్యాంకులో పనిచేసిన అనంతరం మార్చి 2012లో ప్రధాని కార్యాలయంలో విధుల్లో చేరి 2015 మార్చి వరకు ఉన్నారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్లారు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌ ప్రస్తుత సీఎస్‌ బీబీ వ్యాస్‌కు గతేడాది నవంబర్‌లోనే 60 ఏళ్లు నిండాయి. అప్పుడే ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉండగా ముఫ్తీ విజ్ఞప్తి మేరకే ఇప్పటికే రెండుసార్లు వ్యాస్‌కు పొడిగింపునిచ్చారు. ఇప్పుడు ఆయన స్థానంలో సుబ్రమణ్యం నియమితులవ్వగా వ్యాస్‌ గవర్నర్‌కు సలహాదారునిగా ఉంటారు.

నక్సల్‌ వ్యతిరేక నిపుణుడు విజయ్‌కుమార్‌
జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన మొదలైన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఓ కీలక వ్యక్తిని గవర్నర్‌ వోహ్రాకు సలహాదారుగా నియమించింది. నక్సల్‌ వ్యతిరేక కార్యకలాపాల్లో పేరుగాంచిన, స్మగ్లర్‌ వీరప్పన్‌ను అంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించిన అధికారి కె.విజయ్‌ కుమార్‌ వోహ్రాకు సలహాదారుగా నియమితులయ్యారు.

1975 బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ (65).. పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్‌ వీరప్పన్‌ను 2004లో మట్టుబెట్టిన ప్రత్యేక కార్యదళానికి నేతృత్వం వహించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో 2010లో నక్సల్స్‌ 75 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని హతమార్చిన అనంతరం ఆ దళానికి డీజీగా కూడా విజయ్‌కుమార్‌ పనిచేశారు.  


మోదీ కశ్మీర్‌ విధానం సరైనదే: రాజ్‌నాథ్‌
న్యూఢిల్లీ: ‘మోదీజీ కశ్మీర్‌ విధానం సరైనదే. దానిపై ఎలాంటి అనుమానం అక్కర్లేదు. కశ్మీర్‌ సమస్య ఇప్పటిది కాదు. అనేక ప్రభుత్వాలకు ప్రధాన సవాలుగా నిలిచిన దీన్ని పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుంది’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు.

అలాగే పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఆయన సీనియర్‌. పరిపక్వత ఉన్న రాజకీయవేత్త. కానీ మనం తండ్రీ, కుమార్తె(మెహబూబా)ల మధ్య పోలిక తీసుకురాకూడదు. మెహబూబా చేతనైనంత వరకూ చేశారు’ అని పేర్కొన్నారు. రంజాన్‌ సందర్భంగా సైనిక ఆపరేషన్లను నిలిపివేయడాన్ని పొరపాటుగా తాను భావించడం లేదన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్‌ నిలివేస్తేనే చర్చలు సాధ్యమన్నారు.

రంజాన్‌లోనూ ఉగ్ర కార్యకలాపాలు: రావత్‌
రంజాన్‌ సందర్భంగా సైనిక ఆపరేషన్లను నిలిపివేసినప్పటికీ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగించారని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. గవర్నర్‌ పాలన ఉగ్రవాదుల ఏరివేతపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు.

మరిన్ని వార్తలు