మహిళల నేతృత్వంలో అభివృద్ధి

5 May, 2018 01:36 IST|Sakshi

బీజేపీ మహిళా కార్యకర్తలతో సంభాషించిన మోదీ  

సాక్షి, బెంగళూరు: దేశం మహిళాభివృద్ధి నుంచి మహిళల నాయకత్వంలో అభివృద్ధి (ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ టు ఉమెన్‌–లెడ్‌ డెవలప్‌మెంట్‌) దిశగా అడుగులేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘మహిళలే ముందు’ అనేది తమ ప్రభుత్వ, పార్టీ విధానమనీ, ఇదే తమ మంత్రమని ఆయన శుక్రవారం పేర్కొన్నారు. ఈ నెల 12న కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలతో నరేంద్ర మోదీ యాప్‌ ద్వారా ప్రధాని సంభాషించారు. ‘బీజేపీలో మహిళా శక్తి కీలకం. పార్టీ అయినా, ప్రభుత్వమైనా, కార్యక్రమాల రూపకల్పనైనా.. మాకు మహిళలే ముందు’ అని మోదీ పేర్కొన్నారు.

ఇటీవలి షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్యదేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రుల సదస్సుల్లో పాల్గొన్న మహిళలు ఇద్దరేననీ, వారిద్దరూ తమ మంత్రివర్గంలోని వారేనని మోదీ వ్యాఖ్యానించారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తుతం రాజ్యసభలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ 1999 లోక్‌సభ ఎన్నికలప్పుడు బళ్లారి నుంచి కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీపై పోటీచేసి ఓడిపోయారని మోదీ గుర్తుచేశారు. ఈ విధంగా ఎస్‌సీవో సదస్సులో పాల్గొన్న ఇద్దరు మంత్రులకు కర్ణాటకతో సంబంధం ఉందన్నారు.

బూత్‌ స్థాయిలోనూ గెలవాలి..
‘మనం రాష్ట్రంలో గెలవాలి. గెలుస్తాం. నియోజకవర్గాల్లో గెలవాలి. అదీ గెలుస్తాం. కానీ పోలింగ్‌ బూత్‌ స్థాయిలోనూ గెలిచేందుకు కృషి చేయాలని నేను కార్యకర్తలను కోరుతున్నాను’ అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పనులు, తీసుకొచ్చిన వివిధ పథకాలపై కాంగ్రెస్‌ అబద్ధాలు ప్రచారం చేస్తోందంటూ మహిళల కోసం తాము తీసుకొచ్చిన వివిధ పథకాలను ఆయన ప్రస్తావించారు.

మంచి కుటుంబ విలువలు, సంస్కృతితో పిల్లలను పెంచడంతోపాటు పోలీసులు బాగా పనిచేసి, దోషులకు సత్వర శిక్షలు పడేలా చేస్తే మహిళలపై దురాగతాలు ఆగుతాయని అన్నారు. నేరస్తుల్లో భయం పుట్టించడం కోసం తమ ప్రభుత్వం ఐపీసీ, సీఆర్‌పీసీతోపాటు పోక్సో చట్టంలో పలు సవరణలు చేసిందని మోదీ తెలిపారు. ఒలింపిక్స్‌లో అయినా కామన్వెల్త్‌ గేమ్స్‌లో అయినా దేశం గర్వపడేలా చేసింది క్రీడాకారిణులేననీ, సామాజిక, ఆర్థిక రంగాలు సహా అనేక విభాగాల్లో మహిళలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. 

మరిన్ని వార్తలు