యూపీలో వలస కార్మికులపై రాజకీయాలు

21 May, 2020 18:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఉత్తరప్రదేశ్‌ వలస కార్మికులను గమ్య స్థానాలకు చేర్చడంలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కూడు, గూడు లేకుండా కాలి నడకన బయల్దేరిన యూపీ వలస కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వచ్చింది. వారిని తీసుకొచ్చేందుకు వెయ్యి బస్సులను ఏర్పాటు చేస్తామని, వాటికయ్యే ఖర్చును పార్టీయే భరిస్తుందని, అందుకు అవసరమైన అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మే 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఓ లేఖ రాశారు.

అందుకు సంతోషంగా అనుమతి మంజూరు చేయాల్సిన యోగి ప్రభుత్వం ఆ వెయ్యి బస్సుల నెంబర్లు, వివరాలు తెలియజేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీకి లేఖ రాసింది. తీరా ఆ బస్సుల వివరాలు వచ్చాక, వాటిలో వంద బస్సులను అస్సలు బస్సులే అనలేమంటూ, మరో 290 బస్సులకు సరైన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లతోపాటు అవసరమైన ఇతర డాక్యుమెంట్లు ఏవీ లేవంటూ కేసు పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌ లల్లూపై చీటింగ్, ఫోర్జరీ కేసులు పెట్టింది. పైగా బస్సుల జాబితాలో తప్పులున్నాయంటూ ప్రియాంక గాంధీ కార్యదర్శిపై కేసు బనాయించింది. (ఈ సడలింపులు ఎవరికి ప్రయోజనకరం?)

యోగి వలస కార్మికులను ఆదుకోకపోగా, ఆదుకునేందుకు ప్రయత్నించిన తమపై అనవసరంగా కేసులు పెట్టిందంటూ కాంగ్రెస్‌ పార్టీకి కూడా కోర్టు కెక్కింది. కాంగ్రెస్‌ పార్టీ పార్టీ ప్రచారమో, పలుకుబడి కోసమో వలసకార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిందనడంలో సందేహం లేదు. అనుమతించి ఉన్నట్టయితే దాదాపు 30 వేల మంది కార్మికులైన సురక్షితంగా యూపీ చేరుకునే అవకాశం ఉండింది. యూపీ లాంటి పరిస్థితి అన్ని రాష్ట్రాలకున్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో వలస కార్మికుల కోసం కాంగ్రెస్‌ పార్టీ బస్సులను ఏర్పాటు చేసి ఉండాల్సిందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా వలస కార్మికుల రైలు చార్జీలను భరించేందుకు తమ పార్టీ ముందుకొచ్చిన విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ గుర్తు చేసింది. (లాక్‌డౌన్‌: ఆగని విషాదాలు)

మరిన్ని వార్తలు