ఇసుక దందా వెనుక సర్కార్‌ పెద్దలు

7 Jan, 2018 03:17 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న కోదండరాం. చిత్రంతో చాడ, తమ్మినేని తదితరులు

‘చలో నేరెళ్ల’ పాదయాత్ర ముగింపు సభలో కోదండరాం 

సిరిసిల్ల రూరల్‌/ సిద్దిపేట: సర్కార్‌లోని పెద్దల బంధువులే ఇసుక దందా నిర్వహిస్తున్నారని జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో జేఏసీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట జిల్లా నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నేరెళ్లలో సంఘీభావ సభలో కోదండరాం మాట్లాడారు. ఆంధ్రా దోపిడీదారుల నుంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మాఫియా చేతుల్లోకి వెళ్లిందని, తెలంగాణలో మాఫియా రాజ్యం కొనసాగుతోందని ధ్వజమెత్తారు.

నేరెళ్ల ఘటన జరిగి ఆర్నెల్లు గడుస్తున్నా బాధ్యులైన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ఇసుక దందా పేరిట జరిగేవన్నీ ప్రభుత్వ హత్యలేనని, ఇప్పటి వరకు 42 హత్యలు జరిగాయని ఆరోపించారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ సర్కారు పతనం నేరెళ్ల నుంచే ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా నేరెళ్ల బాధితులు తమ గోడును నాయకుల ఎదుట వెళ్లబోసుకున్నారు.

మరిన్ని వార్తలు