లోక్‌సభతోపాటు 11 రాష్ట్రాలకూ ఎన్నికలు!

14 Aug, 2018 01:46 IST|Sakshi
అమిత్‌ షా

బీజేపీ మదిలో ఇదే ఆలోచన.. వద్దంటున్న విపక్షాలు

ఏకకాల ఎన్నికలకు ఓకే చెప్తూ లా కమిషన్‌కు బీజేపీ లేఖ

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలతోపాటే 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పును అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. జమిలీ ఎన్నికలకు తాము సిద్ధమేనంటూ న్యాయ కమిషన్‌కు పార్టీ చీఫ్‌ అమిత్‌  లేఖ రాసిన నేపథ్యంలో ఈ పరిణామాలకు ప్రాధాన్యత ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏడాదిన్నరలోపు ఎన్నికలు జరిగే (మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌) రాష్ట్రాలకు కూడా 2019లో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ చూస్తోంది.

బిహార్‌ అసెంబ్లీకి 2020లో ఎన్నికలు జరగనున్నాయి. జేడీయూ బీజేపీ ఆలోచనకు మద్దతు తెలుపుతుండటంతో.. బిహార్‌ను ఈ జాబితాలో కలుపుతారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మిజోరంలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అధిష్టానంతోపాటు పార్టీలోనూ ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా మోదీ హవా.. రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ప్రతిబింబిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొనవచ్చని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యతిరేకమని విమర్శిస్తున్నాయి.  

ఏకకాల ఎన్నికలకు బీజేపీ మద్దతు
దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అధికార బీజేపీ మద్దతు ప్రకటించింది. ఈ విధానం వల్ల ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని, దేశమంతా ఏడాది పొడవునా ఎన్నికల వాతావరణం ఉండకుండా చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా న్యాయ కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖను సోమవారం పార్టీ నేతలు లా కమిషన్‌కు అందజేశారు. ఏకకాలంలో ఎన్నికలు  ఆలోచన మాత్రమే కాదు. ఆచరించదగింది కూడా అని పేర్కొన్నారు.

రెండు దఫాలుగా ఎన్నికలు జరపడం వల్ల దేశ సమాఖ్య విధానం మరింత బలోపేతం అవుతుందని లేఖలో షా తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధమే లేదన్నారు. తరచూ ఎన్నికలు పెడితే ఎన్నికల నియమావళి అమలవుతుందని, ఆ క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలకు, విధాన నిర్ణయాలకు అవరోధం కలుగుతుందని తెలిపారు. ఏకకాల ఎన్నికలపై ప్రతిపక్షాల వ్యతిరేకత రాజకీయపరమైనదిగా కనిపిస్తోందన్నారు. అధికార ఎన్డీఏ పక్షంతోపాటు అకాలీదళ్, ఏఐఏడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, టీఆర్‌ఎస్‌ ఏకకాల ఎన్నికలను సమర్ధించగా, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, టీడీపీ, జేడీఎస్, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా