వారిని సస్పెండ్‌ చేస్తేనే అసెంబ్లీకి వస్తాం

10 Nov, 2017 11:02 IST|Sakshi

సీఎం, స్పీకర్‌ రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తేనే అసెంబ్లీకి వస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. గురువారం తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫిరాయింపుదారులను సస్పెండ్‌ చేయాలనే డిమాండ్‌తో తమ పార్టీ అసెంబ్లీ బహిష్కరణకు పిలుపు ఇచ్చిందన్నారు. ఇలాంటి సమయంలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరికి సీఎం చంద్రబాబునాయుడు పచ్చకుండువా కప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని నిర్వీర్యం చేయడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ పార్టీ సభ్యులను టీడీపీలోకి చేర్చుకుంటున్నారని అన్నారు. ఫిరాయింపుదారులు...డబ్బులు, ఇతర అవసరాల కోసం పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్నారన్నారు.

వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అంది రెండున్నరేళ్లు అవుతున్నా స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఎందుకు సస్పెండ్‌ చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబునాయుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌లు రాజ్యాంగేతర శక్తులుగా అవతరించి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్న వారిని ప్రశ్నించే నాథుడే లేకపోవడం బాధాకరమన్నారు. తమ పార్టీ తరపున అసెంబ్లీ బహిష్కరణకు పిలుపునిస్తే కనీసం స్పీకర్‌ కోడెల శివప్రసాద్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సంప్రదింపులు చేయకపోవడం, తమ డిమాండ్లను తెలుసుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తమ పార్టీ అసెంబ్లీ బహిష్కరణకు పిలుపు ఇచ్చిందన్నారు. తమ పార్టీ నుంచి ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలపై ఎప్పుడైతే బహిష్కరణ వేటు వేస్తారో అప్పుడు అసెంబ్లీకి వస్తామన్నారు. కొందరు టీడీపీ మంత్రులు...సమస్యలపై చర్చించలేక వైఎస్సార్‌సీపీ పారిపోయిందని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయించాలన్నారు.  కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు