పోలింగ్‌ నేడే!

22 Mar, 2019 08:53 IST|Sakshi
కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి సామగ్రిని తీసుకెళ్తున్న ఎన్నికల సిబ్బంది

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: శాసనమండలిలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు సంబంధించి రెండు ఎమ్మెల్సీ సీట్ల పోలింగ్‌ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నాలుగు పాత జిల్లాల్లోని 42 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఓట్లు 1,96,321 ఉండగా.. ఉపాధ్యాయుల ఓట్లు 23,214 ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ కోసం 15 కొత్త జిల్లాల్లో 313 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ స్థానానికి జరిగే పోలింగ్‌కు 253 పోలింగ్‌ కేంద్రాలు పనిచేస్తాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని ఎన్నికల అధికారి, కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపు ఈనెల 26న జరుగుతుంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీకి 17 మంది, ఉపాధ్యాయ స్థానానికి ఏడుగురు పోటీ
పట్టభద్రుల స్థానానికి జరుగుతున్న ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎమ్మెల్సీ కోసం 17 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. పార్టీ అభ్యర్థులుగా కాంగ్రెస్‌ నుంచి టి.జీవన్‌రెడ్డి, బీజేపీ నుంచి పి.సుగుణాకర్‌రావు, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా రాణి రుద్రమ పోటీ చేస్తుండగా.. గ్రూప్‌–1 అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు అధికార టీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించింది. బీజేపీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ కామారెడ్డికి చెందిన రణజిత్‌ మోహన్‌ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.

కరీంనగర్‌లో ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేసిన కేశిపతి శ్రీధర్‌రాజు ఇటీవల పోటీనుంచి తప్పుకుని టీఆర్‌ఎస్‌ మద్దతుదారుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించారు. ఇక టీచర్ల ఎమ్మెల్సీకి ప్రస్తుత శాసనమండలి చీఫ్‌విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి, పీఆర్‌టీయూ తరఫున కూర రఘోత్తంరెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డి తదితరులు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు నాలుగు పూర్వ జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎవరికివారే గెలుపు ధీమాతో ఉన్నారు.

ఓటేసే ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు అర్హత గల ఉద్యోగులందరికీ ప్రభుత్వం శుక్రవారం రోజున ప్రత్యేక క్యాజువల్‌ లీవ్‌ ప్రకటించినట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపారు. అర్హత గల ఉద్యోగులందరు ఓటుహక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిపుష్టికి తమవంతు సహకారం అందించాలని కోరారు. అలాగే పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంబంధిత సంస్థలకు కూడా శుక్రవారం సెలవు వర్తింస్తుందని తెలిపారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఏర్పాట్లు పూర్తి : ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లుపూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలో ఎన్నికల సామగ్రిని కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియం, హుజూరాబాద్‌ రెండు చోట్లనుంచి ఇచ్చి పంపించినట్లు ఆయన తెలిపారు.  పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు 409 పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 430 మంది ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, 430 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, 1227 మంది ఇతర పోలింగ్‌ ఆఫీసర్లను ఎన్నికల నిర్వహణకు నియమించినట్లు పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 250 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు 1227 బ్యాలెట్‌ బాక్సులను వినియోగిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను అన్ని పోలింగ్‌ స్టేషన్లలో వందశాతం వెబ్‌æకాస్టింగ్, వీడియోగ్రఫీ చేయిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లలో దివ్యాంగులకు ర్యాంపులు, వీల్‌చైర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ ఓటర్లందరికీ ఓటర్‌ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్లు వివరించారు. పోలింగ్‌ స్టేషన్లలో ఎస్సై, ఏఎస్‌ఐ, హెచ్‌ఎస్‌వోలు, స్ట్రైకింగ్‌ ఫోర్స్, ఇతర పోలీసులు, హోంగార్డులకు బందోబస్తు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిసెప్షన్‌ సెంటర్‌ కరీంనగర్‌ అంబేద్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేశామని, శుక్రవారం సాయంత్రం 4గంటల నుంచి ఇండోర్‌ స్టేడియంలోని రిసెప్షన్‌ సెంటర్‌లో బ్యాలెట్‌ బాక్సులను స్వీకరించి పటిష్టమైన పోలీసు బందోబస్తుతో బలపరుస్తామని వివరించారు.

మరిన్ని వార్తలు