మాజీ ప్రధానుల కోసం మ్యూజియం

25 Jul, 2019 04:18 IST|Sakshi

తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మోదీ వెల్లడి

కొందరు ప్రధానులను ఓ వర్గం కావాలని తక్కువ చేసిందని మండిపాటు

న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానులందరి సమగ్ర సమాచారంతో తమ ప్రభుత్వం ఓ భారీ మ్యూజియంను ఏర్పాటు చేయనుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. రాజకీయ అంటరానితనాన్ని రూపుమాపేలా కొత్త రాజకీయ సంస్కృతిని తాము తీసుకొస్తామని ఆయన అన్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌పై రాజ్యసభ డెప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ రాసిన ఓ పుస్తకాన్ని మోదీ ఢిల్లీలో ఆవిష్కరించారు. అక్కడ మాట్లాడుతూ ‘ఓ కుటుంబానికి చెందిన మాజీ ప్రధాన మంత్రుల జ్ఞాపకాలు తప్ప మిగిలిన ప్రధానుల వివరాలు ఏ మాత్రం లేకుండా చెరిపేసేందుకు ఓ వర్గం రాజకీయ నాయకులు ప్రయత్నించారు.

చంద్రశేఖర్‌ నాడు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపడితే, దానికి వ్యాపారవేత్తలు డబ్బులిచ్చారని ఆ వర్గం రాజకీయ నాయకులు ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్ట దిగజార్చాలని చూశారని మోదీ గుర్తుచేశారు. ఇలాగే బీఆర్‌.అంబేడ్కర్, సర్దార్‌ పటేల్, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, మొరార్జీ దేశాయ్‌ తదితర అనేక మంది గొప్ప నేతల ప్రతిష్టను మసకబార్చేందుకు కూడా స్వాతంత్య్రానంతరం కుటిల ప్రయత్నాలు జరిగాయని మోదీ అన్నారు. ఈనాటి యువతరంలో లాల్‌ బహదూర్‌ శాస్త్రి లాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎంత మందికి తెలుసని ఆయన ప్రశ్నించారు. ‘వాళ్లంతా మొదట ప్రజల మెదళ్ల నుంచి అదృశ్యమయ్యారు.

ఇది చెప్పడానికి నాకు బాధాకరంగా ఉండొచ్చు కానీ ఓ వర్గం రాజకీయ నేతలే అలా చేశారు. కానీ మీ అందరి ఆశీస్సులతో మాజీ ప్రధానులందరికీ కలిపి ఓ పెద్ద మ్యూజియంను నిర్మించాలని నేను నిర్ణయించాను. ఆనాటి నుంచి ఇటీవలి ఐకే గుజ్రాల్, దేవె గౌడ, మన్మోహన్‌ సింగ్‌ల వరకు.. ప్రతి ఒక్కరూ ఈ దేశాభివృద్ధికి కృషి చేశారు. వారి సేవలను మనం గుర్తించాలి. గౌరవించాలి’ అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌ను కాదని జవహర్‌లాల్‌ నెహ్రూను తొలి ప్రధానిగా నియమించిన విషయాన్ని మోదీ హాస్యంతో చెప్పారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ నేతనేత గులాం నబీ ఆజాద్‌ హాజరయ్యారు.  

మరిన్ని వార్తలు