కోట లేని మా‘రాజు’ కోట్లు కొల్లగొట్టారు

9 Mar, 2019 15:13 IST|Sakshi

చిన్నరాజుగారి ఆజ్ఞ మేరకే వ్యవహారాలన్నీ..

దారికి రాకుంటే బెదిరింపులు.. కాదంటే కేసులు

ముమ్మిడివరం ఎమ్మెల్యే అరాచరిక పాలన

సాక్షి టాస్క్‌ఫోర్స్‌(తూర్పు గోదావరి) : కొన్ని వందల ఏళ్ల క్రితం మనం రాజరిక పాలన చూశాం. అక్కడ రాజు చెప్పిందే శాసనం. ఆయన కోటరీలో ఉండే వారి కనుసన్నల్లోనే పాలన సాగుతుంది. యుగాలు.. తరాలు మారినా నియోజకవర్గంలో మాత్రం పరోక్షంగా ఇంకా రాచరిక వ్యవస్థ మాదిరిగా పాలన సాగుతోంది. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఓ ప్రభువులా, ఆయన ఆదేశాలతో పనిచేసే కోటరీ కనుసన్నల్లోనే నియోజకవర్గ పాలన సాగుతోంది. ఆ కోటరీలోని  నేతలు అంటే నియోజకవర్గ అధికారులకు వణుకు. వారు ఏ పనికైనా ఆర్డరేస్తే నిబంధనలతో పని లేకుండా ఆ పని పూర్తి కావాల్సిందే. ప్రజలు కూడా ఈ కోటరీ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకోవాలి. కాదంటే పోలీసు కేసులు ఉంటాయి. దారికి రాకపోతే బెదిరింపులతో కూడిన దండన ఉంటుంది. ఒక రాజు.. కొంతమంది  ప్రధాన అనుచరులతో నియోజకవర్గంలో సాగే అరాచక పాలన పైకి రాజుల ప్రజా రంజక పాలనలా కనిపిస్తుంది. లోలోపల మాత్రం ప్రజా వంచక పాలన సాగుతోంది. 

రూ.50 కోట్లకు పైగా ఇసుక  దోపిడీ

తాళ్లరేవు మండలం పిల్లంకలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక 

సహజ వనరులను దోచుకోవడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. వారికి ఎమ్మెల్యే బుచ్చిబాబు అండగా నిలుస్తున్నారు. ఎమ్మెల్యే సోదరుడు పృథ్వీ ఆశీస్సులతో గౌతమి, వృద్ధ గౌతమీ నదీపాయలను గుల్ల చేసేస్తున్నారు. రోజుకు వేలాది ట్రాక్టర్ల ఇసుకను తరలించేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా రూ.50 కోట్లకు పైగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. అనధికారిక ర్యాంపుల ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తూ ఇసుకాసురులు కోట్లాది రూపాయల ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. వీరికి ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉండడంతో  అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. బహిరంగంగానే గోదావరి పాయల నుంచి ఇసుకను అక్రమంగా తరలించుకు పోతున్నారు. అనునిత్యం నిరంతరాయంగా ఇసుక అక్రమ దందా కొనసాగుతున్నా పట్టించుకొనే అధికారులు లేకపోవడంతో ఇసుకాసురులకు కాసుల పంట పండింది.

ముమ్మిడివరం నియోజకవర్గంలో పిల్లంక, పల్లవారిపాలెం, అన్నంపల్లి, ఎదుర్లంక, కేశనకుర్రు పశువుల్లంక ఇసుక ర్యాంపుల్లో అనధికార రవాణా కొనసాగుతోంది. నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న పాండిచేరి యానాం అక్రమార్కులకు అడ్డాగా నిలుస్తోంది. యానాంలో అధికారులకు ఇసుక రవాణాపై ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో ఇక్కడ ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. యానాం పరిసర ప్రాంతాల్లోని గోదావరి పాయల్లో ఇసుకను సేకరించి విక్రయిస్తున్నారు. నియోజకవర్గంలో ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో పది అనధికార  రీచ్‌ల ద్వారా కోట్లాది రూపాయల ఇసుకను అక్రమంగా తరలించుకు పోయారు.

ట్రాక్టర్‌ ఇసుకకు రూ.150లు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇలా రోజుకు 1500 నుంచి 2000 ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిస్తూ   లక్షలాది రూపాయలు తెలుగు తమ్ముళ్ల తమ జేబులు నింపుకొంటున్నారు. ఇలా నెలకు కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకునేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. పరిసర గ్రామాల్లో ఉన్న తెలుగు తమ్ముళ్లలకు రోజుకు కొంత మొత్తంలో సొమ్ములు ముట్టచెప్తూ తమ అక్రమార్జనకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఇసుక ర్యాంపును తెలుగు తమ్ముళ్లు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇసుక ఉచితమంటూ ట్రాక్టర్‌కు రూ.175లు జట్టుకూలీ గాను, మరో రూ.75లు బాట చదును చేయడానికి వసూలు చేయాలని ప్రభుత్వం అనుమతులిచ్చింది. అది అనధికార వ్యక్తుల ప్రమేయం లేకుండా రెవెన్యూ, పోలీసుల పర్యవేక్షణలో ఇసుక తరలించాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు.

అయితే ఇక్కడ జరుగుతున్నదంతా తెలుగు తమ్ముళ్ల పర్యవేక్షణలోనే. మండల స్థాయి నాయకుడికి చెందిన కార్యకర్తలే ర్యాంపు నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. జట్టుకూలీ రూ.175లు ర్యాంపు బాట నిర్వహణకు కేటాయించిన రూ.175తో పాటు అదనంగా రూ.650 అంటే ట్రాక్టర్‌కు రూ.1000 వసూలు చేస్తున్నారు. జట్టు కూలీ రూ.175 ఎగుమతి కూలీలకు పోగా మిగిలిన రూ.825లు ఇలా రోజుకు 1500 నుంచి 2000 ట్రాక్టర్ల వరకు ఇసుక తరలిస్తూ నెలకు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. అలాగే నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. రైతుల భూముల్లోను, ప్రభుత్వ పట్టా భూముల్లో, మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎమ్మెల్యే అండదండలతో తెలుగు తమ్ముళ్లు అక్రమ మట్టి తవ్వకాలతో కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు.

నదీ పరివాహక ప్రాంతాల్లో పెరుగు లంకలను ప్రభుత్వం పేద వర్గాలు సాగు చేసుకుని జీవనోపాధి పొందేలా ఆయా గ్రామాల వారికి డీ ఫారం పట్టాలు ఇచ్చారు. అయితే రియల్టర్లు, కాంట్రాక్టర్ల కన్ను ఈ భూములపై పడింది. ఈ భూముల్లో తువ్వ ఇసుకను తరలించి లే అవుట్లు చదును చేయడానికి ఉపయోగిస్తున్నారు. లంకాఫ్‌ ఠానేల్లంక, కర్రివానిరేవు, గేదిల్లంక, పశువుల్లంక, పిల్లంక, గాడిలంక, కొత్తలంక, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. భారీ యంత్రాలు, వాహనాలు వినియోగిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు రియల్టర్ల అవతారమెత్తి లంక భూములను కొల్లగొడుతున్నారు. విలువైన భూములను గుల్ల చేస్తున్నారు. ఎటువంటి సీనరేజీ లేకుండానే సుమారు రూ.10 కోట్ల వరకు అక్రమ మట్టిని కొల్లగొట్టినట్లు సమాచారం.

ఇసుక దోచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు

తెలుగుదేశం నాయకులు ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక సీనరేజ్‌తో పంచాయతీలకు ఆదాయం సమకూరేది. ఇప్పుడు ఆ సొమ్ములు దేశం నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సహజ వనరులను ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారు.
- గుదే వెంకటేశ్వర్లు, అన్నంపల్లి, ముమ్మిడివరం మండలం

13 ఎకరాల సత్రం భూముల్లో పాగా

ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో ఉన్న వారణాసి సుబ్బారాయుడు సత్రం

అధికారం అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు భూ ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతూ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పోరంబోకు భూములతో పాటు దేవదాయ శాఖ భూములు, సత్రం భూములు స్వాధీనం చేసుకుని పక్కా భవనాలు నిర్మించుకుంటున్నారు. నామ మాత్రపు లీజు కడుతూ కోట్లాది రూపాయల విలువైన సత్రం భూములు కబ్జా చేస్తున్నారు. బాటసారులు సేదతీరేందుకు, అన్న దానం చేసేందుకు దాతలు సత్రాలు నిర్మించి వాటి నిర్వహణకు భూములను దానంగా ఇచ్చారు.

అయితే వాటిని అధికార పార్టీ నాయకుల అండదండలతో నామమాత్రపు  లీజు పేరుతో స్వాధీనం చేసుకొని పక్కా భవనాలు నిర్మించుకున్నారు. దీంతో రూ.10కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమై దాతల ఆశయం నెరవేరకుండా పోతోంది. పూర్వీకులు తమకున్న ఆస్తిలో కొంత ధనాన్ని వెచ్చించి అన్నదాన సత్రాలను నిర్మించేవారు. ఆకలిగా ఉన్న వారిని ఆదుకోవడమే కాకుండా బాటసారులకు ఉపశమనం కల్పించేందుకు కట్టడాలు నిర్మించి వాటి నిర్వాహణకు కొంత భూమిని కేటాయించేవారు. కాలానుగుణంగా వాటి నిర్వహణ బాధ్యత అధికారుల చేతుల్లోకి వచ్చింది. తెలుగుతమ్ముళ్ల స్వార్థంతో అవి అవినీతికి ఆలవాలంగా మారాయి. దాతల ఆశయాలు నీరు గారిపోయాయి.

ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో వారణాశి సుబ్బారాయుడు సత్రం 1911లో నిర్మించారు. కొమానపల్లి గ్రామానికి చెందిన వారణాశి సుబ్బారాయుడు ముత్యాలు, పగడాల వ్యాపారం చేసేవారు. అప్పట్లో ఫ్రాన్స్‌ దేశస్తులు సమీపంలోని ఫ్రెంచి యానాంలో వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. కోనసీమ నలుమూలల నుంచి వ్యాపారులు, ప్రజలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు వెళ్తూ ఈ ప్రాంతంలో కొంత సేపు సేదతీరేవారు. వారి ఉపయోగార్థం సుబ్బారాయుడు ప్రధాన రహదారిని ఆనుకుని కొమానపల్లిలో 30 సెంట్లు విస్తీర్ణంలో సత్రం నిర్మించారు. దీని నిర్వహణకు చిన కొత్తలంక గ్రామంలో 13.75 ఎకరాల భూమిని కేటాయించారు. బాటసారులు సేద తీరేందుకు సువిశాల గదులతో భవనం నిర్మించారు.

మంచినీటి స్నానాలు చేసేందుకు పెద్ద బావిని నిర్మించారు. 1985 వరకు ఈ సత్రం నిర్వహణ సక్రమంగా జరిగింది. తదనంతరం భూములను ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు  గుత్తుల పాటేశ్వరరావు, వరప్రసాద్‌లకు చెందిన కుటుంబ సభ్యుల పేరున నామమాత్రపు లీజు చెల్లిస్తూ తమ స్వాధీనంలో  ఉంచుకున్నారు. ఆదే గ్రామానికి చెందిన నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకుడి అండదండలతో దాదాపు గత 30 ఏళ్లుగా వారి స్వాధీనంలో ఉంచుకుని ఆ భూముల్లో పక్కా భవనాలు నిర్మించుకున్నారు. ఆక్రమణదారులకు ఆ టీడీపీ నాయకుడు వత్తాసు పలకడంతో  దేవదాయ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ఆ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అక్రమణ దారుల చేతుల్లోకి వెళ్లడంతో సత్రానికి లీజు ఇవ్వకుండా రివెన్యూ అధికారులకు పన్నులు చెల్లించకుండా సత్రం సొమ్మును దర్జాగా దోచేసుకుంటున్నారు.

ప్రజా సంక్షేమంలా కోడి పందేలు

కోర్టులు, పోలీసులు కోడి పందేలు వద్దంటూ హెచ్చరిస్తున్నా ఇక్కడ పాలించే రాజుకు చెవికెక్కవు. పేకాట, కోడి పందేలతో కూడిన వినోదం సంప్రదాయ హక్కులా మాట్లాడారు. కోర్టులు, పోలీసులు ఏమనుకున్నా.. ఎన్ని ఆంక్షలు పెట్టినా నియోజకవర్గంలో సంక్రాంతికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్రికెట్‌ మైదానాన్ని గ్యాలరీని తలపించేలా కోడి పందేల బరులు, ఎల్‌ఈడీ తెరలతో ప్రసారం... పందేల రూపంలో రూ.కోట్లు చేతులు మారతాయి. వందలాది పందెం కోళ్లు కాళ్లకు కట్టిన కత్తుల వేటులకు బలై నేల కూలతాయి.

కోడి పందేలకు అదనపు వినోదంగా పేకాటలు, గుండాటలు ఇలా అసాంఘిక కార్యకలాపాలకు నియోజకవర్గం సంక్రాంతి మూడు రోజులు వేదిక అయిపోతుంది. పోలీసుల నోళ్లను మామూళ్లతో మూయిస్తారు. నాలుగేళ్లు నుంచి ఏటా సంక్రాంతికి భారీ పందేలకు ఆ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే జరుగుతాయి. నాలుగేళ్లుగా కోడి పందాల నిర్వహణతో రూ.5 కోట్ల వరకు దండుకున్నారు. ఆ ప్రజాప్రతినిధి సోదరుడే ఇసుకాసురులకు బాస్‌ కావడం గమనార్హం. తాళ్లరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో ఇప్పటికీ ఇసుక దందా కొనసాగుతోంది. వివిధ కార్పొరేషన్ల నుంచి మంజూరయ్యే రుణాలు పొందినవారెవరూ ఇక్కడ పేదలు కాదు. టీడీపీ కార్యకర్త అయితే చాలు అదే అర్హత.

ఇక గృహ నిర్మాణ రుణాల మంజూరు కోటరీ కనుసన్నల్లోనే ఉంటోంది. ఒక్కో ఇంటి రుణ లబ్ధిదారుడి నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేలు తీసుకుని మంజూరు చేయిస్తున్నారు.  ప్రజలు తమకు ఏదైనా అవసరం, ఇబ్బంది అనివార్యమైనప్పుడు ఆ ప్రజాప్రతినిధి వద్దకు నేరుగా వెళ్లి చెప్పుకునే పరిస్థితి ఉండదు. కోటరీలోని చిన్న బాస్‌లను ప్రసన్నం చేసుకుంటేనే వారు ఏ పని కోసం వచ్చారో ఆ పని పూర్తవుతుంది. తమ తోవకు అడ్డువచ్చే వారిని.. తమకు ఎదురు తిరుగుతున్న వారిని కోటరీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. అలాంటి వారిపై తమకున్న అధికార బలంతో పోలీసులతో బైండోవర్‌ కేసులు లేదా ఇతర పోలీసు కేసుల్లో అక్రమంగా ఇరికించేస్తారు. ఇందులో బాధితులు ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు కావడం గమనార్హం.

అభివృద్ధి ఆమడదూరం

గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి జరుగలేదు. కనీసం తాగునీరు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కూడా లేక జనం ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ నాయకులు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం దారుణం. నిరుపేదలకు సంక్షేమ పథకాలు సైతం పూర్తిగా అందడంలేదు.
– వడ్డి ఏడుకొండలు, విశ్వజన కళామండలి జిల్లా అధ్యక్షుడు, సుంకరపాలెం, తాళ్లరేవు మండలం

‘మరుగు’లోనూ రూ.8కోట్లు మెక్కేశారు

పూర్తిగా సొమ్ములు తీసుకున్నా నిర్మాణం పూర్తి కాని మరుగుదొడ్డి

బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో పట్టణాలు, గ్రామాల్లో చేపడుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణపనుల్లో అంతులేని అవినీతి జరిగింది. పాత వాటికి రంగులు పూసి కొన్ని, నిర్మాణం కాకుండానే మరికొన్ని వాటికి  పూర్తిస్థాయిలో బిల్లులు తీసుకుని సుమారు రూ.8 కోట్లు వరకు సొమ్ములు కాజేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర పేరుతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎస్‌) గ్రామాలు ఎంపిక చేసి నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకున్నారు.

చాలాచోట్ల ఈ నిర్మాణ పనులు పూర్తి కాకుండానే బిల్లులు దండుకుంటూ లబ్ధిదారులకు టోపీ పెడుతున్నారు. అధికారులు సైతం చూసీ చూడనట్లుగా వ్యవహరించడంతో అవకతవకలు చోటుకున్నాయి. గత జూలై చివరి నాటికి ఓడీఎఫ్‌ గ్రామాలుగా ప్రకటించాలని లక్ష్యంతో నిర్మాణాలు వేగవంతం చేశారు. లక్ష్యం పూర్తికావాలనే ఉన్నతాధికారుల వత్తిడి మేరకు చాలాచోట్ల నిర్మాణం పూర్తికాకుండానే రికార్డుల్లో పూర్తి అయినట్లు  నమోదు చేసేశారు.

ఉన్నవాటికి మెరుగులు దిద్ది..

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో కొన్నిచోట్ల ఉన్న వాటినే  కొత్తగా నిర్మించినట్లు చూపి బిల్లులు తీసుకున్న వైనం తేటతెల్లమవుతోంది. స్థానికంగా నాయకుల ప్రోద్బలంతో అధికారులు వాటికి పచ్చ జెండా ఊపడంతో అక్రమాలు జోరుగా జరిగాయి. ఒక్కొక్క మరుగుదొడ్డికి ప్రభుత్వ సాయం రూ.15వేలు ఇస్తుండగా పాతవాటికి బిల్లులు చేయించడానికి ముందుగానే లబ్ధిదారులతో మాట్లాడుకుని బిల్లులు తీసుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఉన్నతాధికారుల లక్ష్యాన్ని నిర్దేశించడంతో వాటిని పూర్తిచేసినట్లుగా కూడా ఉంటుందని చాలాచోట్ల రికార్డులకే పరిమితం చేశారు.

పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్డిని నేరుగా నిర్మించుకోలేని లబ్ధిదారులకు ఎస్‌ఎల్‌ఎఫ్‌ ద్వారా నిర్మించి ఇచ్చే ప్రక్రియ ఉంది. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలు వీటిని ఓ కాంట్రాక్టర్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగించి అక్కడ కొనసాగుతున్న పని ఆధారంగా విడతల వారీగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. వీటిలోనూ ఆక్రమాలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల మరుగుదొడ్లు నిర్మించుకుండానే బిల్లులు తీసుకోగా కొన్ని చోట్ల మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు చెల్లించేశారు.

ముమ్మిడివరం నగర పంచాయతీలో ఇటీవల మరుగుదొడ్ల నిర్మాణంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగర పంచాయతీలో 2 వేలు పైచిలుకు మరుగుదొడ్లు మంజూరయ్యాయి. నిర్మాణ పనులు వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈ పనులను చాలావరకు నిర్మాణ బాధ్యతలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ప్రభుత్వం నుంచి రూ.15 వేలుతో అధికారులు అప్పగించిన కొలతల ఆధారంగా సిమెంటు ఇటుకలతో నిర్మించాలి.

అధికారులు ఇచ్చిన కొలతలతో నిర్మించిన మరుగుదొడ్లు విశాలంగా లేకపోవడంతో లబ్ధిదారులు సంతృప్తి చెందలేకపోతున్నారు. దీంతో వారి కోరిక మేరకు కొలతల ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో పాటు అదనంగా రూ.5 వేల నుంచి 10 వేల వరకు లబ్ధిదారుల నుంచి సొమ్ములు వసూలు చే శారు. అంతేకాకుండా పలు వార్డుల్లో ముందుగా నిర్మించుకున్న మరుగుదొడ్లు ఎస్‌ఎల్‌ఎఫ్‌లో పెట్టి ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ.5వేలు ఇచ్చి మిగిలిన సొమ్ము స్థానిక నాయకులు, కాంట్రాక్టర్‌ నొక్కేశారు.

జియో ట్యాగింగ్‌లో మతలబు

నిర్మాణం పారదర్శకత కోసం జియో ట్యాగింగ్‌ చేపట్టారు. పనుల ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు ఫొటోలు తీసి జియో ట్యాగింగ్‌ చేయాలి, ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల అక్రమాలు చోటు చేసుకున్నాయి. బిల్లులు చెల్చించే ప్రక్రియలో ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకుండానే యూనిట్లకు పూర్తి స్థాయి బిల్లులు చెల్లించినట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు నగర పంచాయతీ పరిధి 13వ వార్డులో పెయ్యల ధనలక్ష్మి పేరున మంజూరైన మరుగుదొడ్డిని ఎస్‌ఎల్‌ఎఫ్‌ ద్వారా ఓ కాంట్రాక్టర్‌కు నిర్మాణ బాధ్యత అప్పగించారు. అయితే నిర్మాణం పూర్తికాకుండానే  తన  పేరున రూ.15 వేలు తీసుకున్నారని నిర్మాణం పూర్తి చేయాలని అడుగుతున్నా పూర్తి చేయడం లేదని ఆమె తెలిపింది.

అలాగే వాకపల్లి నాగలక్ష్మి పేరు మీద మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేసినట్లు ఎస్‌ఎల్‌ఎఫ్‌ ద్వారా రూ.15వేలు తీసుకున్నారు. అయినా మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేయలేదని ఆమె తెలిపారు. అవినీతిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులకు ఫిర్యాదు చేయగా అవినీతి తేటతెల్లమైంది. అలాగే నియోజకవర్గంలో 14,253 యూనిట్లు మంజూరు కాగా రూ.13.60 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. బాధితులు పలు పర్యాయాలు అధికారులకు ఫిర్యాదు చేసినా అవినీతి బయటపడకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు.

తమ్ముళ్లే నీరు–చెట్టు కాంట్రాక్టర్లు 

నియోజకవర్గంలో నీరూ–చెట్టు పథకం పనులు అవినీతికి ఆనవాళ్లుగా దర్శనమిస్తున్నాయి. నియోజకవర్గంలో నీరు–చెట్టూ పథకంలోరూ. రూ7.72 కోట్లతో పంటకాలువల రిటైనింగ్‌ గోడలు, పూడిక తీత పనులు చేపట్టారు. గత ఏడాది చేపట్టిన పంటకాలువల రిటైనింగ్‌ గోడలు అక్కడక్కడా కూలిపోయి అవినీతికి అద్దం పడుతున్నాయి. నియోజక వర్గంలో ముమ్మిడివరం, ఐ.పోలవరంలలో 2017–18 ఏడాదిలో మాత్రమే నీరు–చెట్టు పథకం పనులు చేపట్టారు. కాట్రేనికోనలో 2016–17లో  తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తి అయినకాడికి దండుకున్నారు.

2017–18 సంవత్సరంలో మాత్రమే 78 పనులకు రూ.2.69 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటిలో అధికశాతం పనులు పంట కాలువలకు రిటైనింగ్‌ గోడలు నిర్మించారు. మిగిలిన పనులు కాలువ టీపీల నిర్మాణం చేశారు. ఈ పనుల్లో అధికశాతం రూ.10 లక్షల లోపు పనులుగా కేటాయించి నామినేటెడ్‌ ప్రాతిపదికన తెలుగు తమ్ముళ్లకే కట్టబెట్టారు. మిగిలిన పనులకు టెండర్లు పిలిచినా నీటి సంఘం పర్యవేక్షణలో అధికార పార్టీకి చెందిన నీటి సంఘాలే పనులు చేపట్టాయి.

నియోజకవర్గంలో జరిగిన నీరు చెట్టూ పనులన్నీ కాంక్రీటు పనులే కావడం గమనార్హం. దాదాపు అన్ని పనుల్లోనూ నాణ్యత లేదనే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ కార్యక్రమాల నిర్వహణకు కాంట్రాక్టర్లు, నీటి సంఘాల నాయకులు డబ్బులు ఇవ్వాల్సి రావడంతో పలు చోట్ల నాణ్యత లోపించిందనే ఆరోపణలు వినిపిస్తునాయి. ముమ్మిడివరం మండలంలో రూ.60 లక్షలతో 11 పనులు చేపట్టారు. మాగాం–అయినాపురం, అయినాపురం–ఉప్పలగుప్తం, అయినాపురం–కాట్రేనికోన, కాలువ గట్లకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు చేపట్టారు.  పూర్తైన రిటైనింగ్‌ గోడలు పలు చోట్ల నాణ్యత లోపించి అనతికాలంలోనే శిథిలమయ్యే ప్రమాదముందని రైతులు అంటున్నారు. వాటి నిర్మాణం జరిగిన చోట మట్టి పనులు అసంపూర్తిగా వదిలేశారు.

ఇష్టానుసారంగా పనులు

పనులను తెలుగుదేశం కార్యకర్తలకు అప్పగించడంతో ఇష్టానుసారంగా చేపట్టారు. కాలువల్లో పూడిక తీత పనులు తూతూ మంత్రంగా చేశారు. నాసిరకం మెటీరియల్‌తో నాణ్యత లేకుండా రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మించారు. అవి అక్కడక్కడా శిథిలమై కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి కాకుండానే బిల్లులు తీసుకున్నారు. అయినాపురం–ఉప్పలగుప్తం కాలువలో పూడికలు తీయకుండా వదిలి వేయడంతో సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు అస్తవ్యస్తంగా చేస్తున్నారు.
– ఏఎస్‌వీ సుబ్బారావు, రెతు, అయినాపురం

మరిన్ని వార్తలు