రూ. 5కోట్ల విలువైన భూమి..రూ. 50లక్షలకే..

23 Sep, 2019 16:10 IST|Sakshi

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, విశాఖపట్నం : విశాఖ భూ కుంభకోణంపై మరోమారు విచారణ జరుగుతుందని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ వేదికగా జరిగిన తప్పుడు ఒప్పందాలన్నింటిపై విచారణ జరగబోతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పెద్దల పేర్లు ఈ భూ కుంభకోణంలో ఉన్న కారణంగానే సిట్ విచారణ నివేదిక అప్పట్లో బయటపడలేదని ఆరోపించారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... విశాఖపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నగర అభివృద్ది చూడలేకే కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురించాయని విమర్శించారు. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడాన్ని ఓ వర్గం జీర్ణించుకోలేకపోతుందన్నారు. విశాఖను అభివృద్ది చేయడానికి సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తుంటే టీడీపీ.. దాని అనుకూల మీడియాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు విశాఖకు ఏం చేశారో చెప్పాలని అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. ఇక్కడి ప్రజలను చంద్రబాబు ఉపయోగించుకున్నారే గానీ విశాఖకు చేసిందేమీ లేదని విమర్శించాను. నగరాన్ని పేకాట క్లబ్‌గా మార్చిన ఘనత మీది కాదా చంద్రబాబు అని ప్రశ్నించారు. 

గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ...‘  దివంగత సీఎం వైఎస్సార్‌ విశాఖ అభివృద్దికి కృషి చేశారు. అచ్యుతాపురంలో వేలాది ఎకరాలలో ఎస్ఇజెడ్ స్ధాపించింది కూడా ఆయనే. విమ్స్‌ను స్ధాపించిన ఘనత వైఎస్సార్‌దే. అంతేకాదు విశాఖలో హెల్త్ సిటీని ప్రారంభించింది కూడా వైఎస్సారే కదా. పోలవరంతో విశాఖ దాహార్తిని తీర్చేందుకు ఆయన ప్రయత్నించారు. విశాఖలో ఎన్నో కీలకమైన ప్రాజెక్ట్ లు తీసుకొచ్చింది కూడా ఆయనే. విశాఖ ఎయిర్ పోర్టు విస్తరణ కూడా వైఎస్సార్ హయాంలోనే జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రజల కోసం సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది కూడా ఆయనే. ఇలా ఎన్నో రంగాలలో విశాఖను అభివృద్ది చేసిన తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం వైఎస్ జగన్ విశాఖను మరింతగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు అని తెలిపారు. అయితే కొంతమంది మాత్రం...వైఎస్ జగన్‌ను కించపరిచేలా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికలలో లబ్ది పొందాలనే టీడీపీ తప్పుడు ప్రచారాలతో కుట్రలు చేస్తోందని విమర్శించారు.

ఆంధ్రజ్యోతికి రూ. 50లక్షలకే భూమి
‘విశాఖలో భూ దందాలకు పాల్పడింది మీరు. విశాఖ భూ కుంభకోణం మీ హయాంలో జరగలేదా. విశాఖను దోచుకుంది మీరు కాదా. మీలాగా అక్రమాలను,‌ అసాంఘిక కార్యక్రమాలను వైఎస్సార్ సీపీ ప్రోత్సహించదు అని గుడివాడ అమర్‌నాథ్ చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. టీడీపీ అనుకూల పత్రికలలో వచ్చిన కథనాలపై సుమోటాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కమిషనర్ ను కోరబోతున్నట్లు తెలిపారు. అదే విధంగా రూ. 5 కోట్ల కోట్ల విలువైన భూములను ఆంధ్రజ్యోతికి రూ. 50 లక్షలకే గత ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో స్థానికులకి 75 శాతం ఉద్యోగాలిస్తామని ఒప్పందాలు చేసుకుని ఉల్లంఘనలకు పాల్పడిన ఐటీ కంపెనీలపై చర్యలు తీసుకోవాలి’ అని ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు