'దండుపాళ్యం గ్యాంగ్‌ ఎవరో తేలుతుంది'

27 Dec, 2019 18:31 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో శనివారం విశాఖకు రానున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలకనున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి పార్టీని‌ నడిపే అర్హత లేదని, విజయనగరం పర్యటనను హఠాత్తుగా ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకి అమరావతి తప్ప రాష్ట్రంలోని‌ మిగిలిన ప్రాంతాలపై ప్రేమ లేదని విమర్శించారు.  

విశాఖలో వైఎస్సార్ సీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. ఒకవేళ అది నిజమని నిరూపిస్తే ఆ భూములు వారికే ఇచ్చేస్తామన్నారు. ఆలీబాబా అరడజను దొంగలు ఎవరో... దండుపాళ్యం గ్యాంగ్‌ ఎవరో త్వరలోనే తేలుతుందని హెచ్చరించారు. సుజనా చౌదరి లాంటి చీటర్‌ చెప్పే మాటలకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంతా సీఎం వైఎస్ జగన్‌కు మేమంతా రుణపడి ఉంటాం. సీఎం వైఎస్ జగన్ రాకతో విశాఖ నగరానికి మహర్దశ పట్టబోతుందని అమర్‌నాథ్‌ తెలిపారు. జీఎన్‌ రావు కమిటీతో పాటు నిపుణుల కమిటీ నివేదిక కూడా వచ్చిన తర్వాత రెండు కమిటీల నివేదికలపై చర్చించి విశాఖకు పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తారని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

విఎంఆర్డీఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన నేపథ్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఎన్ఏడి తాటి చెట్ల పాలెం రైల్వే స్టేషన్ రోడ్, ఫ్లైఓవర్, వుడా పార్క్ కైలాసగిరి వరకు ఇరువైపులా విశాఖ పౌరులతో స్వాగత సన్నాహాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కైలాసగిరిపై 37 కోట్ల వ్యయంతో ప్లానిటోరియం పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. దీంతో పాటు వుడా సెంట్రల్ పార్క్‌లో రూ. 380 కోట్ల అంచనా వ్యయంతో, విఎంఆర్డీఏలో రూ. 800 కోట్ల వ్యయంతో  జివిఎంసి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్‌ జగన్‌  సెంట్రల్ పార్క్ లో ఏర్పాటు చేసిన  విశాఖ ఉత్సవ్ ఫ్లవర్ షో ను ప్రారంభించిన అనంతరం అక్కడినుంచే ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా