ఫిరాయింపు ఎమ్మెల్యేలను కొన్నప్పుడు ఏమైంది ఈ నీతి?

25 Aug, 2018 06:50 IST|Sakshi
విలేకర్లతో మాట్లాడుతున్న అమర్‌నాథ్, వరుదు కళ్యాణి

మంత్రి అయ్యన్నకు గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్న

విశాఖ సిటీ, నక్కపల్లి: కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు తెలుగుదేశం పార్టీని ఛీత్కరిస్తారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కొన్నప్పుడు ఈ నీతి ఏమైందని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. శుక్రవారం రేగుపాలెం వద్ద వైఎస్‌ జగన్‌ బస చేసిన ప్రాంతం వద్ద విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా చంద్రబాబునాయుడు కొనుగోలు చేస్తూంటే అయ్యన్నపాత్రుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. అది నీతిమాలిన చర్య అని అయ్యన్నకు అనిపించలేదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి నీతి, నిజాయితీలు ఎన్టీ రామారావు మరణంతోనే పోయాయన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. అయ్యన్న అంత అవినీతిపరుడు ఎవరూ ఉండరన్నారు.

అయ్యన్నకు విదేశాల్లో కూడా వ్యాపారాలున్నాయన్నారు. ధాయిలాండ్‌లో లేఅవుట్లు వేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారన్నారు. నర్సీపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ స్థలాన్ని ప్రత్యూష కంపెనీకి లీజుకు ఇస్తున్నప్పుడు మంత్రి ఎందుకు అభ్యంతరం పెట్టలేదని ప్రశ్నించారు. అన్ని లాంఛనాలు పూర్తయిన తర్వాత ఇక్కడ మల్టీప్లెక్స్‌ కడితే గోతిలో వేసి పాతేస్తానని హెచ్చరించడం ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు చెందిన స్థలాన్ని కూడా గంటా అండ్‌ కో ఇలాగే లీజుకు తీసుకుని వదిలేసిందన్నారు. మంత్రులిద్దరూ కలసి జిల్లాను, ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆయన వెంట స్థానిక నాయకులు బోదెపు గోవిందు, పలివెల అమృతవల్లి ఉన్నారు.

టీడీపీలో వణుకు
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోందని అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి అన్నారు. శుక్రవారం ఆమె భోజన విరామ సమయంలో మాట్లాడుతూ పాదయాత్ర జరుగుతున్న గ్రామాల్లో ప్రజలంతా జన్మభూమి కమిటీ  సభ్యులు, టీడీపీ నేతల అన్యాయాల గురించి ఏకరువు పెడుతున్నారన్నారు. వచ్చే  ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బోరున పడుతున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అశేష ప్రజానీకం జగనన్న వెంట పాదయాత్రలో పొల్గొనడంతోపాటు బహిరంగ సభలను విజయవంతం చేస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు