చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణకు టీడీపీ సిద్ధమా!

18 Feb, 2020 04:33 IST|Sakshi

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌

సాక్షి,అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు సంపాదన, ఆస్తులపై సీబీఐ విచారణకు తెలుగుదేశం పార్టీ సిద్ధమా అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు. అలా కాదంటే రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలపై ఐటీ శాఖపై పరువు నష్టం దావా వేసే దమ్ము, ధైర్యం ఉందా అని టీడీపీ నేతలను నిలదీశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎప్పుడు మీడియా ముందు ఉండే చంద్రబాబు ఈ అవినీతి ఆరోపణలపై ఎందుకు నేరు మెదపడం లేదని ప్రశ్నించారు. దీనిపై బాబు పుత్రుడు లోకేశ్, దత్త పుత్రుడు పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్‌నోట్‌లో రూ.రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని పేర్కొంటే.. ఎక్కడ రూ.రెండు వేల కోట్లు ఉన్నాయని స్వయం ప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు అంటున్నారని దుయ్యబట్టారు. యనమలకు కంటిచూపు కూడా పోయిందని, కంటి వెలుగు పథకం కింద ఆయనకు కంటి వైద్యం చేయించాలని సీఎంను కోరతానని చెప్పారు.

ఐటీ ప్రకటనతో బాబుకు చలి, జ్వరం
ఐటీ శాఖ ప్రకటనతో చంద్రబాబుకు చలి, జ్వరం వచ్చి ఇంటికే పరిమితమయ్యారని అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. ‘రూ.రెండు కోట్ల టర్నోవర్‌ కూడా లేని కంపెనీలను పెట్టి ఆర్థిక లావాదేవీలు జరిపారని స్పష్టంగా ఐటీ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. విదేశాలకు డబ్బును పంపించి మళ్లీ తెప్పించుకున్నారు. కొన్ని కాంట్రాక్టులు, సబ్‌ కాంట్రాక్ట్‌ల ద్వారా డబ్బులు బదలాయించారు’ అని ప్రెస్‌నోట్‌లో స్పష్టంగా ఉంటే.. బాబు అండ్‌ కో, ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. ఇకపై జయము జయము చంద్రన్న పాటలు ఆపి.. జైలు జైలు చంద్రన్న పాటలు వేసుకోవాలని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ ఏ రోజూ పొత్తుల కోసం వెంపర్లాడ లేదన్నారు.

మరిన్ని వార్తలు