ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే భాషేనా అది: కొడాలి

8 Apr, 2019 15:58 IST|Sakshi

గుడివాడ(కృష్ణా జిల్లా): ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై గుడివాడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని(కొడాలి వెంకటేశ్వర రావు) తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొడాలి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, రాధాకృష్ణల మధ్య జరిగిన సంభాషణల వీడియోతో వీరి అసలు నైజం బయటపడిందని, ఆ సంభాషణల్లో ఎన్టీఆర్‌ గురించి చంద్రబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు తనను బాధించాయని కొడాలి అన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ అభిమానిగా ముందు నుంచి చెబుతున్నానని, ఉచ్ఛం, నీచం లేనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడని శాపనార్ధాలు పెట్టారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని కొట్టేసి, ఆయన పదవిని కూడా లాక్కుని మరణానికి కారణమైన నీచాతినీచుడు చంద్రబాబు అని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నాలుగు గోడల మధ్య ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే భాషేనా అది...బయటకు వచ్చి ప్రజలు రాళ్లతో కొడతారేమోనని ఆయన విగ్రహాలకి దండలు వెయ్యటం, పథకాలకి పేరు పెట్టినట్లు నటించడం చంద్రబాబు నాయుడికి అలవాటేనని తూర్పారబట్టారు.

బాబు ఎన్టీఆర్‌ పాలిట దుర్మార్గుడని, రాష్ట్రానికి పట్టిన శని అని దుయ్యబట్టారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు, చంద్రబాబును ఇంటికి సాగనంపుతారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడిని, రాజకీయంగా భూస్థాపితం చెయ్యటానికి తాను ముందు ఉంటానని, ఎన్టీఆర్‌ అభిమానులు అందరూ తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇంకా చంద్రబాబు మాటలు విన్నాక కూడా ఎన్టీఆర్‌ అభిమానులు చంద్రబాబు వెంట ఉంటే ఆయన ఆత్మక్షోబిస్తుందని చెప్పారు. ఎన్టీఆర్‌ అభిమానులు అందరూ వైఎస్‌ జగన్‌ వెంట నడిచి ఫ్యాన్‌ గుర్తుకి ఓటేసి చంద్రబాబుకు చరమగీతం పాడాలని విన్నవించారు.

మరిన్ని వార్తలు