‘హైదరాబాద్‌ను డల్లాస్‌ చేస్తానని.. డర్టీగా మార్చారు’

1 Dec, 2018 15:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గవర్నర్‌ గుళ్లు, గోపురాలు తిరిగే బదులు.. ఆస్పత్రులలకు వెళ్తే జనాలకు మేలు చేకురుతుందని సూచించారు టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ నిలిచిపోయిందన్నారు. దీనివల్ల పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పాలనాపరంగా సరైన చర్యలు తీసుకోనప్పుడు.. గవర్నర్‌ జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కానీ గవర్నర్‌ ఆ ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు.

కేసీఆర్‌ హైదరాబాద్‌ను డల్లాస్‌గా మారుస్తానని చెప్పి.. డర్టీగా మార్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ తెలంగాణను.. బంగారు తెలంగాణగా మారుస్తారని నమ్మి ప్రజలు ఆయనను సీఎంగా ఎన్నుకున్నారని తెలిపారు. కానీ కేసీఆర్‌ రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. ఈ నెల 3న రాహుల్‌ గాంధీ గద్వాల్‌​, తాండూర్‌, హైదరాబాద్‌ నగరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి రోడ్‌ షో నిర్వహిస్తారని తెలిపారు. సోనియా గాంధీని మరోసారి రాష్ట్రానికి రావాల్సిందిగా కోరామని.. ఆమె ఆరోగ్యం సహకరిస్తే వస్తారని వెల్లడించారు. రాహుల్‌ గాంధీ కూడా ఈ నెల 5న మరోసారి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు.

మరిన్ని వార్తలు