‘కేసీఆర్‌ క్యాబినెట్‌లో దద్దమ్మలు ఉన్నారు’

19 Oct, 2019 16:18 IST|Sakshi

పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు తలపెట్టిన బంద్‌ పూర్తిగా విజయవంతమైందని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వం పోలీసులతో బంద్‌ను విఫలం చేయాలని ప్రయత్నించినా... ప్రజలు మాత్రం స్వచ్చందంగా రోడ్లపైకి బంద్‌ను విజయవంతం చేశారని పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాజకీయ నాయకుల గృహ నిర్బంధాలు.. అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. కార్మికులతో చర్చలు జరపాలని ఉన్నత న్యాయస్థానం చెప్పినా... బేఖాతరు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఆయనపై కోర్టు ధిక్కారణ నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదని.. స్వచ్చందంగా పని చేయలేని దద్దమ్మలు ఆయన క్యాబినేట్‌లో ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందని.. నియంతృత్వ వైఖరి వీడకపోతే ప్రకృతి ఆయనను శిక్షిస్తుందని దుయ్యబట్టారు.

చర్చలు జరపాలి..
‘అనుభవం లేని డ్రైవర్ల కారణంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ మొండి పట్టు వీడి కార్మికులతో చర్చలు జరపాలి. ఇబ్బందులు ఏమైనా ఉంటే.. మీ సమస్యలు గవర్నర్‌కు వివరించండి. ఆర్టీసీ ఆస్తులను తన చెంచాలకు కట్టబెట్టడానికే కేసీఆర్ సంస్థకు పూర్తిస్థాయి ఎండీని పెట్టలేదు. హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నా. ధైర్యం ఉంటే.. హుజుర్‌నగర్ ఎన్నికను రిఫరెండంగా తీసుకుంటారా. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే అక్కడ సభను రద్దు చేసుకొని మొహం చాటేశారు. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయ్యాయి. హైదరాబాద్‌లో మరీ దారుణంగా మారాయి. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఒకరోజు నగరంలోని అన్ని రోడ్లపై తిరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి’ అని నారాయణరెడ్డి సీఎం కేసీఆర్‌ తీరును విమర్శించారు.

మరిన్ని వార్తలు