ఈ తీర్పు.. కేంద్రంలో తేనుందా మార్పు?

19 Dec, 2017 02:49 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించినట్లే బీజేపీ విజయం సాధించింది. అయితే హిమాచల్‌ ప్రజలే కమలం పార్టీ వైపు దాదాపు ఏకపక్షంగా మొగ్గు చూపినట్లు కనిపించింది. గుజరాత్‌ మాత్రం కాషాయం పార్టీకి కషాయం లాంటి ఫలితాన్నిచ్చింది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం ఆయనకు నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. అభివృద్ధికి నమూనాగా చూపే ఆ రాష్ట్రంలో బొటాబొటి మెజారిటీ రావడంతో మోదీ మూడున్నరేళ్లుగా కేంద్రంలో అనుసరిస్తున్న విధానాలను, అందిస్తున్న పాలనను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి.  

రాజకీయ పరిభాషలో చెప్పాలంటే గుజరాత్‌లో బీజేపీకి వచ్చిన ఫలితాలు మోదీకి నైతిక ఓటమి కిందే లెక్క. ఎందుకంటే అక్కడి ఎన్నికల సంరంభం మొత్తాన్ని ఆయన తన భుజస్కంధాలపై వేసుకొని నడిపారు. ప్రధాని హోదాలో అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. పరిపూర్ణ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. కానీ ఉత్తరప్రదేశ్‌ మాదిరి గెలుపును అందించ లేకపోయారు. దీంతో పార్టీలో, ప్రభుత్వంలో ఇన్నాళ్లూ తిరుగులేని ఆయన ఏకపక్ష అధికారానికి బీటలు వారే ప్రమాదం లేకపోలేదు. భవిష్యత్‌లో ఆయన రక్షణాత్మక ధోరణిని అవలంబించాల్సి రావొచ్చు.
 
గుజరాత్‌ పోరు ఒక దశలో మోదీకి, రాహుల్‌గాంధీకి మధ్య ప్రత్యక్ష పోరాటాన్ని తలపించింది. ఫలితాలను బట్టి చూస్తే ఒకరకంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడిదే పైచేయి. రాహుల్‌ తన పార్టీని దాదాపు విజయం వరకు తీసుకెళ్లారు. ప్రజల తీర్పు ఆ పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. మోదీ సొంత గడ్డపైనే బీజేపీకి సవాల్‌ విసరడం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తల్లో మనోబలం రెట్టింపైంది. గుజరాత్‌ తీర్పు జాతీయ రాజకీ యాల్లో మార్పునకు సంకేతంగా భావించొచ్చు. ఎందుకంటే మే నెలలో వెలువడిన యూపీ అసెంబ్లీ ఫలితాలతో కుప్పకూలి ముక్కలు చెక్కలైన కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు ఆ గడ్డు పరిస్థితుల నుంచి కోలుకొని ఇప్పుడు బీజేపీతో నువ్వా నేనా అనే స్థాయిలో పోరాడే స్థితికి చేరాయి.

జాగ్రత్తలు తీసుకోకపోతే: రానున్న ఏప్రిల్‌–మే నెలల్లో కర్ణాటకలో, ఆ తర్వాత మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌ల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు అంటే 2018 చివర్లో మూడు పెద్ద రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో) ప్రజా తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మరిన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఈ రాష్ట్రాల్లో కూడా చేదు అనుభవాలనే చూడాల్సి ఉంటుంది. పైగా ఎన్డీయేయేతర పార్టీలు (ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, లెఫ్ట్‌ ఫ్రంట్, డీఎంకే, ఇతర ప్రాంతీయ పార్టీలు) నాలుగైదు నెలల్లో ఆ కూటమికి వ్యతిరేకంగా సంఘటితమయ్యే సూచనలున్నాయి.

మరిన్ని వార్తలు