వరంగల్‌ మేయర్‌గా ప్రకాశ్‌రావు

27 Apr, 2019 14:16 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ నగర మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావు ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు ప్రకాశ్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రకాశ్‌రావును అభినందించారు. అనంతరం ప్రకాశ్‌రావు మాట్లాడుతూ.. తన అభ్యర్థిత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్మార్ట్‌ సిటీ, హృదయ్‌ పథకం ద్వారా వస్తున్న నిధులతో పాటు, కేసీఆర్‌ ప్రత్యేకంగా ఇస్తున్నబడ్జెట్‌తో వరంగల్‌ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. నగరాన్ని టూరిజం హబ్‌గా మార్చడం కోసం పాటుపడతానని స్పష్టం చేశారు.

వరంగల్‌ నగర మేయర్‌ స్థానాన్ని దక్కించుకోవడాని కొద్ది నెలలుగా ఆశావహులు అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేశారు. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచన మేరకు అందరు ఐక్యతారాగం వినిపించారు. ఎవరిని మేయర్‌గా ఎంపిక చేసినా కట్టుబడి ఉంటామని తెలుపుతూ.. ఆ బాధ్యతను పార్టీ అధినేత కేసీఆర్‌ అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో మేయర్‌ ఎన్నిక నేడు సాఫీగా సాగింది. కాగా, ప్రకాశ్‌రావు 26వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ప్రకాశ్‌రావు  పార్టీ లో కొనసాగుతున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త, భవితశ్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అయిన ప్రకాశ్‌రావు బీఎస్సీ వరకు చదువుకున్నారు. వరంగల్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌గా నగరపాలక సంస్థ కార్పరేటర్‌గా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రెండు సార్లు పనిచేశారు.

మరిన్ని వార్తలు