డార్జిలింగ్‌లో జంగ్‌: గూర్ఖా వర్సెస్‌ గూర్ఖా

3 Apr, 2019 10:33 IST|Sakshi

పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌ లోక్‌సభ స్థానంలో తొలిసారి ఇద్దరు గూర్ఖా నేతలు తలపడుతున్నారు. 21వ శతాబ్దం ఆరంభంలో గూర్ఖా ఆందోళన నడిపిన గూర్ఖా జన ముక్తి మోర్చా (జీజేఎం)లోని రెండు చీలిక వర్గాలకు చెందిన ఇద్దరు నాయకులు ఇప్పుడు రాష్ట్రంలో పాలక పక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. జీజేఎంలో సీనియర్‌ నేత, డార్జిలింగ్‌ ఎమ్మెల్యే అమర్‌సింగ్‌ రాయ్‌ తృణమూల్‌ తరఫున, మరో జీజేఎం నేత రాజూ సింగ్‌ బిస్తా బీజేపీ టికెట్‌పై పోటీ పడుతున్నారు. జీజేఎం అధినేత బిమల్‌ గురుంగ్‌ వర్గం, ఆయన పూర్వ అనుచరుడు బినయ్‌ తమాంగ్‌ వర్గం బీజేపీ, తృణమూల్‌ తరఫున పరస్పరం తలపడుతున్నాయి. బిమల్‌ గురుంగ్‌ వర్గం బీజేపీతో, తమాంగ్‌ వర్గం తృణమూల్‌ కాంగ్రెస్‌తో చేతులు కలిపాయి. ఇక్కడ గూర్ఖాలు, తేయాకు తోటల్లో పనిచేసే ఇతర ఆదివాసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.

పాగా వేసేందుకు తృణమూల్‌ ఎత్తులు..
మణిపూర్‌ నుంచి వచ్చి స్థిరపడిన యువనేత రాజూ బిస్తాను బీజేపీ అభ్యర్థిగా ఈసారి నిలబెట్టారు. గత రెండు ఎన్నికల్లోనూ డార్జిలింగ్‌ సీటును తృణమూల్‌ కైవసం చేసుకోలేదు. ఈ రెండు పార్టీలూ ప్రత్యేక గూర్ఖాలాండ్‌ ఏర్పాటుకు అనుకూలం కాదు. వాటి లక్ష్యాలు వేరు. గూర్ఖాల భూమి హక్కులకు గుర్తింపు, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత కోసం పోరాడతానని తృణమూల్‌ అభ్యర్థి అమర్‌సింగ్‌ రాయ్‌ చెబుతున్నారు. గూర్ఖాల ఆత్మగౌరవం కోసం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థి బిస్తా ప్రచారం చేస్తున్నారు. 2009లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రాజస్థాన్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌సింగ్, 2014లో ఝార్ఖండ్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి ఎస్‌ఎస్‌ అహ్లూవాలియా గెలిచారు. ఈసారి తప్పక డార్జిలింగ్‌లో పాగా వేయాలనే పట్టుదలతో తృణమూల్‌ పనిచేస్తోంది. గతంలో వరుసగా రెండుసార్లు బీజేపీ గెలిచిన కారణంగా కాషాయపక్షం ఈసారీ డార్జిలింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది. ప్రధాని మోదీకి, బీజేపీకి ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది.

మరిన్ని వార్తలు