రాజ్యాంగం మేరకే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది

30 Jan, 2020 03:35 IST|Sakshi

శాసన మండలి రద్దును రాజకీయ కోణంలో చూడదు

రాష్ట్రం తీర్మానం చేస్తే.. కేంద్రం దానిని ముందుకు తీసుకెళ్లాలి

కేబినెట్‌ ఆమోదిస్తే.. బీజేపీ వ్యతిరేకించడం సాధ్యం కాదు

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడబోదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం వ్యవహరిస్తుందని స్పష్టంచేశారు. ‘ఇది రాజకీయ వ్యవహారం కాదు. బీజేపీ తీసుకునే నిర్ణయమూ కాదు. శాసనమండలి రద్దుపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. వ్యవస్థ ఆధారంగా కేంద్రం ముందుకెళ్తుంది.. రాజకీయ కోణముండే ఆస్కారం లేదు’ అని వెల్లడించారు.

ఎక్కడా రాజకీయాలకు తావుండదు
బిల్లుపై బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘కేబినెట్‌ ఆమోదం పొంది ప్రభుత్వం ద్వారా వచ్చే బిల్లును ప్రభుత్వంలో ఉన్న పార్టీగా వ్యతిరేకించడం సాధ్యం కాదు కదా.. ఏవో కారణాల వల్ల ఆపేస్తారని, రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా ఆపేస్తారని కొందరు అంటున్నారు. నా అవగాహన మేరకు ఆర్టికల్‌ 169(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే దానిని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి. దీనిలో ఎక్కడా రాజకీయాలకు తావులేదు’ అని పేర్కొన్నారు. బీజేపీకి ఏపీ చట్టసభల్లో.. అది కూడా శాసన మండలిలో మాత్రమే ఇద్దరు సభ్యులు ఉన్నారని, మండలి రద్దుతో ఆ ప్రాతినిధ్యం కూడా పోతుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఇద్దరున్నా పది మంది సభ్యులున్నా సంబంధం లేదని, వ్యవస్థకు లోబడి నడుచుకోవాలన్నారు. బిల్లు వెనుక బీజేపీ ఉందన్న విమర్శలను తోసిపుచ్చుతూ.. ‘అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మాత్రమే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. అక్కడ ఏపార్టీ అధికారంలో ఉందన్న అంశాన్ని పరిగణించదు. కాబట్టి రాజకీయ కోణం నుంచి చూస్తే అది తప్పు. దీని వెనక బీజేపీ ఉందన్న విమర్శలు అక్కసుతో కూడినవే. ఏపీ ప్రజలు అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. మేం వారితో కలిసి పోటీచేయలేదు. ఈరోజు కూడా వారు ఎన్డీయేలో భాగస్వామి కాదు. అక్కడ సీపీఎం ఉన్నా రాజ్యాంగ వ్యవస్థకు లోబడి కేంద్రం నడుచుకుంటుంది’ అని స్పష్టం చేశారు. 

షెడ్యూల్‌కు అనుగుణంగా బిల్లుపై ముందుకెళ్తారు
ఈ సమావేశాల్లోనే బిల్లు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. దీనికి సమాధానం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి లేదా హోం శాఖ లేదా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి లభించవచ్చని.. వాటి షెడ్యూలు ప్రకారం సమయానుసారంగా పనిచేస్తాయని చెప్పారు. రాజకీయ కోణంలో జాప్యం చేయడం.. వెంటనే చేయడం వంటి కోణాలకు ఆస్కారం ఉండదని వివరించారు. రాజధానిపై పార్లమెంటులో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందని ప్రశ్నించగా ‘ఇది రాష్ట్ర పరిధిలోని అంశమని గతంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెప్పారు. చర్చకు వస్తే మా పార్టీ వాణిని వినిపిస్తాం. దీనిని రాజకీయంగా రాష్ట్రంలో ఎదుర్కోవాలని గతంలోనే నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించాలనడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం’ అని పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా