బాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు

30 Dec, 2018 04:32 IST|Sakshi

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఫైర్‌

సుప్రీంకోర్టు ఆదేశాలపై హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌

టీడీపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేయాలి

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మతిభ్రమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టు విభజనపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. ఏపీ హైకోర్టు నూతన భవనాన్ని డిసెంబర్‌ 15, 2018 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసిందని, అందువల్ల హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌ విడుదలపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. దాని ఆధారంగానే జనవరి 1, 2019 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారన్నారు. భవన నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయడం చేతకాని చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు కేంద్రంపై నిందలేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పుకొనే చంద్రబాబుకు ఏపీలో రెండు అంతస్తుల హైకోర్టు భవనాన్ని నిర్మించడం చేత కాలేదని విమర్శించారు.

హైకోర్టు నిర్మాణం ఆలస్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి ఉంటే దాని ఆధారంగా న్యాయస్థానం తగిన ఆదేశాలు ఇచ్చివుండేదన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును సైతం టీడీపీ ప్రభుత్వం తప్పుదోవపట్టించిందన్నారు. కోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన టీడీపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసి ఏపీ హైకోర్టులో మొదటి కేసుగా దాన్నే విచారించాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు. ఏపీ హైకోర్టు కార్యకలాపాలను తన క్యాంప్‌ ఆఫీసులలో ప్రారంభిస్తామని చెప్పిన చంద్రబాబు న్యాయవ్యవస్థను తీవ్రంగా అవమానించారన్నారు. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, చెప్పిన సమయానికి భవన నిర్మాణం పూర్తిచేయలేక న్యాయమూర్తులను, న్యాయవాదులను రోడ్డుమీద నిలబడేలా చేసినందుకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌ జారీ కాగానే ఇదంతా తమ వల్లే సాధ్యమైందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ మీడియా ముందు డబ్బాకొట్టుకున్నారని జీవీఎల్‌ గుర్తు చేశారు.

మీపై ఉన్న కేసులు విచారణకే రావడం లేదెందుకు?
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కేసులకు, హైకోర్టు విభజనకు లింకుపెడుతున్న చంద్రబాబు ముందు తనపై ఉన్న అనేక కేసులు అసలు విచారణకే రావడంలేదెందుకని జీవీఎల్‌ ప్రశ్నించారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసు విచారణ జరగడం లేదెందుకో వివరించాలన్నారు. ఇతరుల కేసుల విచారణపై ఆక్షేపించేముందు చంద్రబాబు తన నిజాయితీ ఏస్థాయిలో ఉందో తెలుసుకుంటే మంచిదన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా