ప్యాకేజీ నిధులివ్వాలని చంద్రబాబు లేఖ రాశారు

22 Jul, 2018 04:28 IST|Sakshi

మార్చిలో యూటర్న్‌ తీసుకున్నారు 

ఇది మీ రాజకీయ అవకాశవాదం కాదా? 

చంద్రబాబును ప్రశ్నించిన బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులివ్వాలని సీఎం చంద్రబాబు జనవరి 5న లేఖ రాయడం వాస్తవం కాదా అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా 2015–2020 కాలపరిమితిలో రావాల్సిన రూ.16,445 కోట్లు మంజూరు చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారన్నారు. అయితే దీనికి విరుద్ధంగా మార్చిలో ప్రత్యేక హోదా కావాలంటూ యూటర్న్‌ తీసుకున్నారని మండిపడ్డారు. ఇది రాజకీయ అవకాశవాదం కాదా అని నిలదీశారు. ప్రధాని మోదీ చెప్పినట్టు ఆయన వైఎస్సార్‌సీపీ వలలో చిక్కుకుపోయారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ శాసనమండలిలో, టీడీపీ మహానాడులో తీర్మానాలు కూడా చేశారని గుర్తుచేశారు.

ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటున్న చంద్రబాబు అసలు ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఎన్ని హామీలను నెరవేర్చారని ప్రశ్నించారు. 900 çహామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. హామీలపై ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని భయపడి అసలు మ్యానిఫెస్టోనే లేకుండా చేశారని ధ్వజమెత్తారు. అవిశ్వాస పరీక్ష సందర్భంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య టీడీపీ విద్వేషాలు రెచ్చగొట్టిందని ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా వ్యవహరించిందన్నారు. జాతీయ స్థాయి నేతనని చెప్పుకునే చంద్రబాబు అవిశ్వాస తీర్మానానికి పక్క రాష్ట్రాల మద్దతును సైతం సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ నేతలతో చెట్టాపట్టాలేసుకొని తిరిగినా రాహుల్‌ గాంధీ ప్రత్యేక హోదాపై కనీసం మాట్లాడలేదన్నారు. అవిశ్వాసంపై చర్చను టీడీపీ బావబామ్మర్దుల సినిమాను ప్రమోట్‌ చేయడానికి వాడుకున్నట్టు ఉందన్నారు. చంద్రబాబు తన అనుచరులతో మొత్తం పెట్టుబడులను హైదరాబాద్‌లోనే పెట్టించడం వల్ల రాయలసీమ, కోస్తాంధ్ర తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. ఆ ప్రాంతాలపై వివక్ష ఎందుకు చూపారని ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు